విశాఖలో గూగుల్ సంస్థ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌ను ఏర్పాటు చేస్తోందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. స్వయంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సందర్భం వచ్చినప్పుడల్లా ఈ భారీ పెట్టుబడి గురించి, డేటా సెంటర్ల నిర్మాణం గురించి గొప్పగా చెబుతున్నారు. ఒప్పందాలు కూడా గూగులే చేసుకుంది. అయినా సరే వైసీపీ వాళ్లు అది ఆదాని డేటా సెంటరని.. దాన్ని జగనే తెచ్చారని చెప్పుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే.. అన్నీ తెలిసి వారి మాటల్నే ప్రచారం చేసే వాళ్లు ఉండటం.
గూగుల్ కు కాంట్రాక్టర్ అదానీ
ఒక అంతర్జాతీయ దిగ్గజ సంస్థ తన మౌలిక సదుపాయాల కోసం, విద్యుత్ సరఫరా కోసం అదానీ వంటి ఇతర సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం వ్యాపార ప్రపంచంలో అత్యంత సహజమైన ప్రక్రియ. కానీ, వైసీపీ మేధావుల దృష్టిలో మాత్రం ఇది గూగుల్ ప్రాజెక్టు కాదు, కేవలం అదానీ భవన నిర్మాణమే! అగ్రరాజ్యంలో కూర్చున్న పిచాయ్ ఏమో అది మా హబ్ అని నెత్తీ నోరు మొత్తుకుంటుంటే, తాడేపల్లి గడప దాటని నేతలు మాత్రం అది అదానీ డేటా సెంటరేనంటూ భజన చేయడం చూస్తుంటే వారి అపారమైన రాజకీయ రుద్దుడుకు ఏం సమాధానం ఇస్తారు.
అదానీ కూడా చెప్పుకోవడం లేదే !
వైసీపీ వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. గూగుల్ వంటి సంస్థలు తమ సర్వీసుల కోసం ఎవరితో ఒప్పందం చేసుకున్నాయి అన్న సాంకేతిక అంశాలను పక్కన పెట్టి, కేవలం బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సుందర్ పిచాయ్ మాటల కంటే తమ సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులే వేదవాక్కుగా భావించే నిరక్షరాస్య ఓటర్లే తమ బలం అని వైసీపీ బలంగా నమ్ముతోంది. గూగుల్ సీఈవో చెప్పేది అబద్ధం, మా సోషల్ మీడియా వింగ్ చెప్పేదే పరమ సత్యం అనే స్థాయికి ఈ ప్రచారం చేరిందంటే, వారి వ్యూహకర్తల తెలివితేటలను మెచ్చుకోకుండా ఉండలేం.
అదృష్టమంటే వైసీపీ లీడర్లదే
ఒక అంతర్జాతీయ సంస్థ రాష్ట్రానికి వస్తుందంటే గర్వపడాల్సింది పోయి, దానికి అవాస్తవ రంగులు పూయడం వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందనే కనీస స్పృహ లేకపోవడం విచారకరం. గోబెల్స్ సిద్ధాంతం ప్రకారం ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమవుతుందో లేదో తెలియదు కానీ, వైసీపీ కార్యకర్తల వాట్సాప్ గ్రూపుల్లో మాత్రం అది బ్రహ్మవాక్కు గా మారుతోంది. గూగుల్ సర్వర్ల కంటే వీరి అబద్ధాల సర్వర్లే వేగంగా పనిచేస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గారు బహుశా ఒక విషయం మర్చిపోయి ఉంటారు. టెక్నాలజీతో ప్రపంచాన్ని నడిపిస్తున్న కంపెనీకి ఆయన నాయకత్వం వహిస్తూ ఉండవచ్చుకానీ అబద్ధాన్ని టెక్నాలజీగా మార్చిన వైసీపీ నేతల ముందు ఆయన పరిజ్ఞానం దిగదుడుపే! ఇటువంటి హాస్యాస్పదమైన వాదనలతో జనాన్ని నమ్మించగలగడమే వైసీపీ నాయకత్వానికి ఉన్న అసలైన రాజకీయ అదృష్టం.
