తెలంగాణ కాంగ్రెస్లో అత్యంత సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు. జగిత్యాల రాజకీయాల్లో తన ప్రత్యర్థిగా ఉన్న సంజయ్ కుమార్ను పార్టీలో చేర్చుకోవడం, తనను క్రమంగా పక్కన పెడుతూండటంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆయన ప్రకటించడానికి ముందు నుంచి సీనియర్ నేతలు ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నారు. వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ ఆయన మనసు మార్చేందుకు మాత్రం ప్రయత్నించడం లేదు. అక్కడే ట్విస్ట్ ఉంటోంది..
జీవన్ రెడ్డి పార్టీ మారకుండా ఉంచాలని అధిష్టానానికి ఉంటే, ఆయనకు ముందుగానే తగిన హామీలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతానంటుంటే, మంత్రులు శ్రీధర్ బాబు వంటి వారు వెళ్లి ఆయనను బుజ్జగిస్తున్నారు. కానీ గట్టి హామీలు ఇవ్వడం లేదు॥ ఒక సీనియర్ నేత వెళ్తుంటే కనీసం పట్టించుకోలేదన్న విమర్శ రాకుండా ఉండటానికే ఈ బుజ్జగింపులన్న అభఇప్రాయం వినిపిస్తోంది. సీనియర్ నేతలు వస్తున్నా.. పార్టీలో ఉండాలని కోరుతున్నారు కానీ తన భవిష్యత్ ఏమిటో చెప్పకపోవడంతో.. ఆయనకూ ఏం జరుగుతుందో అర్థం అయింది.
అధిష్టానానికి కూడా ఆయన నిర్ణయంపై స్పష్టత ఉంది. కానీ, వెంటనే ఆయనను వదిలేస్తే కేడర్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించి, మంత్రులను పంపి చర్చలు జరుపుతున్నట్లు కనిపిస్తున్నారు. ఒకవేళ ఆయనను సీరియస్గా పార్టీలో ఉంచాలనుకుంటే, ఆయన అడిగినట్లుగా స్థానిక రాజకీయాల్లో ఆయన మాటే చెల్లుబాటు అయ్యేలా హామీ ఇచ్చేవారు. మేము ప్రయత్నించాం, కానీ ఆయనే వినలేదు అని చెప్పుకోవడానికి భేటీలు నిర్వహిస్తున్నారు. ఒక సీనియర్ నేతను గౌరవప్రదంగా సాగనంపే ప్రక్రియలో భాగంగానే ఈ రాయబారాలు సాగుతున్నాయన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇలా బుజ్జగింపుల వల్ల జీవన్ రెడ్డికీ కాస్త సంతృప్తి దక్కుతుంది.

