తమిళ రాజకీయాల్లో నైతిక విలువల గురించి మాట్లాడిన విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం ఇప్పుడు అధికారం కోసం అడ్డదారులు తొక్కుతోందన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎమ్ఎమ్కే పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే మద్దతు విషయంలో చోటుచేసుకున్న పరిణామాలు విజయ్ కు ఇబ్బందికరంగా మారాయి.
మద్దతు లేఖలు ఫోర్జరీ చేయడం నుంచి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం వరకు టీవీకే శ్రేణులు తప్పుల మీద తప్పులు చేస్తూ పార్టీ పరువును బజారున పడేశాయనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఏఎమ్ఎమ్కే ఎమ్మెల్యే తమకు మద్దతు ఇస్తున్నారని, ఆయన సంతకం చేసిన లేఖ తమ వద్ద ఉందని టీవీకే ప్రకటించింది. అయితే, దీనిపై దినకరన్ తక్షణమే స్పందిస్తూ ఆ లేఖ ఫోర్జరీ అని, తమ ఎమ్మెల్యేను టీవీకే ప్రలోభపెట్టడమే కాకుండా సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి కౌంటర్‌గా టీవీకే వర్గాలు ఆ ఎమ్మెల్యే సంతకం పెడుతున్న వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశాయి. ఇక్కడే టీవీకే దొరికిపోయినట్లయింది.
ట్విస్ట్ ఏమిటంటే, సదరు ఎమ్మెల్యే స్వయంగా మీడియా ముందుకు వచ్చి తాను అసలు టీవీకేకు మద్దతు ఇవ్వలేదని, తన పేరుతో విడుదలైన లేఖతో తనకు సంబంధం లేదని స్పష్టం చేయడంతో విజయ్ వర్గం ఆత్మరక్షణలో పడింది. ఒక ఎమ్మెల్యే తన పార్టీతోనే ఉన్నానని చెబుతున్నప్పుడు, ఆయనను తమవాడిగా చిత్రీకరించడానికి టీవీకే ఎందుకు ఇంతలా దిగజారుతోందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మెజారిటీ మార్కు కోసం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు కోసం పడుతున్న ఈ పాట్లు విజయ్ను ఒక అధికార దాహమున్న నాయకుడిగా ప్రజల్లో ముద్ర వేస్తున్నాయి.
కొద్దిరోజులుగా విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చుట్టూ ఉన్న ఇతర రాష్ట్రాల సలహాదారులు చేస్తున్న తప్పులు పార్టీని సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. లేని మద్దతును ఉన్నట్లుగా చూపడం, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కోవడం వంటివి క్లీన్ పాలిటిక్స్ చేస్తానన్న విజయ్ ఇమేజ్‌కు భిన్నంగా ఉన్నాయి. తమిళ ఓటర్లు ఇలాంటి కుట్ర రాజకీయాలను ఏమాత్రం సహించరని, మొదటి అడుగులోనే ఇలాంటి అప్రతిష్టను మూటగట్టుకోవడం విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
