రియల్ ఎస్టేట్ రంగంలో నకిలీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్లతో సాగుతున్న భూ అక్రమాలకు, డబుల్ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేసేందుకు స్టాంపులు – రిజిస్ట్రేషన్ల శాఖ అత్యంత కీలకమైన, కఠినమైన సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అమాయక కొనుగోలుదారులు మోసపోకుండా ఉండటానికి మరియు భూ యజమానుల హక్కులకు పూర్తి భద్రత కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
బ్లడ్ రిలేషన్ లేకపోతే కఠిన వెరిఫికేషన్
రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్లాట్లు, భూముల కొనుగోలు సమయంలో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనేది అత్యంత కీలకమైన పత్రం. అయితే, అసలు యజమానులకు తెలియకుండానే కొంతమంది కేటుగాళ్లు నకిలీ జీపీఏ పత్రాలను సృష్టించి, విలువైన భూములను ఇతరులకు విక్రయిస్తూ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా భూ అక్రమాలను శాశ్వతంగా అడ్డుకోవడానికి రిజిస్ట్రేషన్ల శాఖ సరికొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇకపై జీపీఏ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత పెంచడమే కాకుండా, డాక్యుమెంట్ల పరిశీలనను మరింత క్లిష్టతరం చేయడం ఈ మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం.
తాజా గైడ్‌లైన్స్ ప్రకారం.. రక్తసంబంధీకులు కాని వ్యక్తులకు, అంటే అవుట్‌సైడర్స్‌కు జీపీఏ ఇస్తున్నప్పుడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ను అత్యంత కఠినంగా అమలు చేయనున్నారు. సాధారణంగా కుటుంబ సభ్యుల మధ్య జరిగే జీపీఏ లావాదేవీలకు మినహాయింపులు ఉన్నప్పటికీ, మూడో వ్యక్తికి ఆస్తిపై సర్వాధికారాలు కట్టబెట్టేటప్పుడు భూమి అసలు లింక్ డాక్యుమెంట్లు, తాజా ఈసీ , రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్‌తో పాటు, ఆస్తి యజమాని నిజంగానే సమ్మతించారా లేదా అనే విషయాన్ని అధికారులు పక్కాగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.
ఈ కొత్త నిబంధనల వల్ల నకిలీ పత్రాలతో ఒకే ఆస్తిని పలుమార్లు రిజిస్ట్రేషన్ చేసే డబుల్ రిజిస్ట్రేషన్ దందాకు పూర్తిగా అడ్డుకట్ట పడనుంది. గతంలో కేవలం నోటరీ లేదా నకిలీ సాక్ష్యాలతో జీపీఏలు పొంది లావాదేవీలు సాగించే వీలుండేది. కానీ, తాజా సంస్కరణల వల్ల ప్రభుత్వ ఆన్లైన్ డేటాబేస్ లోని వివరాలతో సరిపోలితేనే రిజిస్ట్రేషన్ అధికారి ముందుకు వెళ్తుంది. ఏమాత్రం తేడా ఉన్నా లేదా పత్రాలపై అనుమానం వచ్చినా ఆయా డాక్యుమెంట్లను తిరస్కరించే అధికారాలను సబ్-రిజిస్ట్రార్లకు కట్టబెట్టారు. ఇది సామాన్య కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.
