తెలంగాణ సెంటిమెంట్‌ను నమ్ముకుని తెలంగాణ రక్షణ సేన పేరుతో సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన కల్వకుంట్ల కవితకు కాలం ఏ మాత్రం కలిసిరావడం లేదు. కవిత తన పార్టీ పేరును ప్రకటించిన తర్వాత, భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రజాభిప్రాయం, అభ్యంతరాల కోసం పత్రికా ప్రకటన జారీ చేశారు. అయితే, కవిత ప్రకటించిన TRS అనే సంక్షిప్త నామంపై ఈసీకి ఏకంగా 600 నుండి 700 వరకు భారీ సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. వీటికి తోడు, కవిత కంటే ముందే మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన తెలంగాణ రాష్ట్రసామాజిక సేన అనే మరో పార్టీ కూడా ఇదే TRS కోసం ఈసీని ఆశ్రయించడం, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలో ఇటువంటి పేర్లతో రెండు చిన్న పార్టీలు నమోదు కావడం కవితకు ఊహించని పెద్ద శాపంగా మారింది.
మరో వైపు, ఈ వ్యవహారంలో భారత్ రాష్ట్ర సమితి కూడా అధికారికంగా రంగంలోకి దిగింది. TRS అనే పేరును మరే ఇతర కొత్త పార్టీకి కేటాయించవద్దని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ప్రజల మనస్సుల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఓటర్లలో బలంగా నాటుకుపోయి ఉందని వారు గుర్తు చేస్తున్నారు. మూడేళ్ల క్రితమే తాము టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పటికీ.. ఇప్పుడు హఠాత్తుగా ఆ పేరును వేరే శక్తులకు ఇస్తే భవిష్యత్తు ఎన్నికల్లో ఓటర్లు తీవ్రంగా గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని, తద్వారా తమ రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని బీఆర్ఎస్ గట్టిగా వాదిస్తోంది.
ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోబోయే నిర్ణయం అత్యంత కీలకంగా మారింది. సాధారణంగా ఒకే రకమైన ఉచ్చారణ , ఒకే విధమైన సంక్షిప్త నామాలు ఉండి, ఓటర్లను అయోమయానికి గురిచేసేలా ఉంటే ఈసీ ఆ పేర్లను తిరస్కరించే అవకాశాలే ఎక్కువ. ఒకవేళ ఈసీ గనుక అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని TRS అనే పేరును తిరస్కరిస్తే.. కవిత మళ్లీ మొదటికొచ్చి తన పార్టీ పేరును, లోగోను పూర్తిగా మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే టీఆర్ఎస్ ఈజ్ బ్యాక్ అంటూ క్యాడర్లో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తున్న కవితకు.. ఈ అభ్యంతరాల పర్వం పెద్ద రాజకీయ అగ్నిపరీక్షగా మారబోతోంది.


