2027 సంక్రాంతికి ఇంకా చాలా సమయం ఉంది. అయితే ఈలోగానే కొన్ని సినిమాలు కర్చీఫ్లు వేసుకొని, బెర్తులు సిద్ధం చేసుకొనే పనిలో ఉన్నాయి. ప్రతీ సంక్రాంతికి బాలయ్య, చిరు, వెంకీ సినిమాలు రావడం పరిపాటి అయిపోయింది. ఈ సీజన్లో కూడా ఈ ముగ్గురి సినిమాలు ఉండడం దాదాపు ఖాయం. శర్వానంద్ – శ్రీనువైట్ల సినిమా కూడా ఈ సంక్రాంతికే వస్తుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి మరో ఆరేడు నెలల సమయం ఉంది. ఈలోగా ఇంకెన్ని సినిమాలు ఖాయం అవుతాయో తెలీదు.
అయితే మొన్నటికి మొన్న ‘టాక్సిక్’ సినిమా సంక్రాంతికి రాబోతోందన్న ప్రచారం మొదలైంది. యష్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. ఈ వేసవిలో రావాల్సివుంది. కానీ వాయిదా పడింది. తీరా చూస్తే ఈ సినిమా ఇప్పట్లో రాదని, మేకర్స్ సంక్రాంతి బరిలో నిలపాలని చూస్తున్నారన్న వార్త ఊపందుకొంది. ఈలోగా ‘ఫౌజీ’ కి సంబంధించిన ఓ వార్త కూడా హల్ చల్ చేస్తోంది. ప్రభాస్ – హను రాఘవపూడి కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నార్ట. ‘ఫౌజీ’ లాంటి సినిమా వస్తే సంక్రాంతికి ఆ కళే వేరు. ఈయేడాది సంక్రాంతికి ‘రాజాసాబ్’ తో పలకరించాడు ప్రభాస్. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. సో.. ‘ఫౌజీ’ వచ్చి హిట్ అయితే, లెక్క సరిచేసినట్టే. అందుకే ప్రభాస్ కూడా ఈసినిమాని సంక్రాంతి బరిలో నిలపాలని గట్టిగా ఫిక్సయ్యార్ట.
చిరు, వెంకీ, బాలయ్య, ప్రభాస్.. ఈ నలుగురితో సంక్రాంతి పండగ పరిపూర్ణం అవుతుంది. టాక్సిక్ వస్తే… థియేటర్లు మరీ టైట్ అయిపోతాయి. ఈ సినిమాలన్నీ ఖాయం అయితే శర్వానంద్ సినిమా పక్కకు తప్పుకొంటుంది. ఈలోగా సంక్రాంతి ఆశలు పెట్టుకొని, ఏమైనా సినిమాలు తయారవుతుంటే, అవి కూడా ఆశలు వదులుకోవాల్సిందే. అయితే సంక్రాంతికి ఇంకా సమయం ఉంది. ఇప్పుడు లైన్ లో ఉన్న సినిమాలు సైతం.. సంక్రాంతి దగ్గర పడే కొద్దీ తమ అభిప్రాయాన్ని మార్చుకొనే అవకాశం ఉంది.
