ఎన్టీఆర్ – కొరటాల శివ `జనతా గ్యారేజ్` రిజల్ట్ మరి కొద్ది గంటల్లో తేలిపోతుంది. ఎన్టీఆర్ అభిమానులతో పాటు, యావత్ తెలుగు చిత్రసీమ కూడా ఈ సినిమా ఎలా ఉండబోతోందా? అంటూ ఆసక్తితో ఎదురుచూస్తోంది. మిర్చి, శ్రీమంతుడు… ఇలా సినిమా సినిమాకీ తన రేంజ్ పెంచుకొంటూ పోతున్నాడు కొరటాల శివ. కథని రాసుకోవడంలో, క్యారెక్టరైజేషన్లను డిజైన్ చేసుకోవడంలో రెండు సినిమాలతోనే తనదంటూ ఓ మార్క్ సృష్టించుకొన్నాడు శివ. మరోవైపు ఎన్టీఆర్ భీకరమైన ఫామ్‌లోకి వచ్చాడు. టెంపర్ తో హిట్టు కొట్టి, నాన్నకు ప్రేమతో సూపర్ హిట్ అందుకొన్నాడు. మోహన్‌లాల్ లాంటి ఉద్దండుడు అండగా నిలబడ్డాడు. దేవిశ్రీ, మదిలాంటి టెక్నీషియన్ల అండ దొరికింది. ట్రైలర్ చూస్తే అదిరిపోయింది. పాటలు.. హల్ చల్ చేస్తున్నాయి. బిజినెస్ బ్రహ్మాండంగా జరిగింది. శాటిలైట్ చూస్తే.. ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక ధర పలికింది. అన్నింటికంటే మించి నిన్నొచ్చిన సెన్సార్ టాక్ కూడా సంతృప్తికరంగానే ఉంది. అయినా…లోపలేదో టెన్షన్.
ఈమధ్య బాక్సాఫీసు దగ్గర పెద్ద సినిమాలు పల్టీకొట్టడం రివాజుగా మారింది. అంచనాలు మోసుకొచ్చిన ఏ సినిమా.. బాక్సాఫీసు దగ్గర నిలబడలేదు. సర్దార్ గబ్బర్‌సింగ్ దారుణమైన డిజాస్టర్. బ్రహ్మోత్సవం చూసి మహేష్ ఫ్యాన్సే తలలు పట్టుకొన్నారు. కబాలి అందర్నీ కంగారు పెట్టేసింది. సర్దార్, బ్రహ్మోత్సవం చిత్రాలకు సగం డబ్బులు పోయాయి. ఇలాంటి ఫలితాలు చిత్రసీమలో మామూలే.కానీ ఆయా సినిమాలకు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. మార్కెట్ పరంగా ఈ సినిమాల్నీ చరిత్ర సృష్టించాయి. అంతకు ముందు లేని రేట్లు పలికాయి. సెన్సార్ టాక్ కూడా బ్రహ్మాండంగా వచ్చింది. వంద కోట్లు ఈజీగా వసూలు చేస్తాయన్న ధీమా కలిగించాయి. కానీ ఏమైంది?? ఫలితాలన్నీ రివర్స్.. అశలు, అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఎవ్వరూ ఊహించని రీతిలో డిజాస్టర్లుగా మిగిలాయి. ఈ ఫ్లాపులొక్కటే జనతాని భయపెట్టే అంశం.
అందుకే అభిమానులు కూడా సమాది ష్యూర్ షాట్ హిట్స అని ముందే డబ్బా కొట్టుకోవడం లేదు. వాళ్లూ.. కాస్త అండర్ ప్లే చేస్తున్నారు. చిత్రబృందం కూడా ఇదే ఫార్ములా పాటిస్తోంది. సినిమా గురించి గొప్పలు చెప్పుకోవడం లేదు. ఇండ్రస్ట్రీ రికార్డులు బద్దలుకొడతాం చూడండి.. అంటూ తొడలు కొట్టడం లేదు. మంచి సినిమా తీశామనే అంటున్నాయి. ఇదంతా అండర్ ప్లే కిందే లెక్క. భారీ అంచనాల మధ్య వచ్చినప్పుడు ఓ మాదిరి సినిమా ఇచ్చినా ఎక్కదు. అదే.. అంచనాలు లేనప్పుడు యావరేజ్ సినిమా కూడా సూపర్ హిట్ కొడుతుంది. జనతా బృందానికి అదే కావాలి. ఎక్స్పెక్టేషన్స్ ఎంత తగ్గితే అంత మంచిది అంటూ కొరటాల శివ అండ్ కో బలంగా నమ్ముతోంది. అందుకే…. మరీ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మాట్లాడొద్దని డిసైడ్ అయ్యాయి. బహుశా… గత ఫ్లాపులు నేర్పించిన పాఠం ఇదేనేమో?