శివ సినిమాకు ముందు రామ్ గోపాల్ వర్మ ఎవరో కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ మాస్టర్ పీస్ రిలీజ్ అయిన మరుక్షణం నుంచి రామ్ గోపాల్ వర్మ గురించి తెలియని వాళ్ళు లేకుండా పోయారు. సినిమా లవర్స్ అందరికీ వర్మ తెలిసిపోయాడు. గాయం, రంగీలా, కంపెనీ, సర్కార్ లాంటి సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ గురించి తెలుసుకోవాలి. ఆయనను అనుక్షణం ఫాలో అవ్వాలి అనే స్థాయి ఆసక్తి కలిగేలా చేశాడు. అదంతా రామ్ గోపాల్ వర్మ చరిత్ర.
కానీ ప్రస్తుతానికి వస్తే మాత్రం పరిస్థితి రివర్స్‌లో ఉంది. నేను ఒకడిని ఉన్నాను, నన్ను గుర్తించండి అని రామ్ గోపాల్ వర్మనే అందరి వెంటా పడుతున్నాడు. పనితో, ఫలితంతో వచ్చే గుర్తింపు పది కాలాల పాటు ఉంటుంది కానీ మాటలతో, మాయ చేసి తెచ్చుకునే గుర్తింపు ఎంత కాలం ఉంటుంది? కొత్త సినిమాలను తీసే సామర్ధ్యం లేకుండా పోయిందో, లేక అదే పని చేసి చేసి మొహం మొత్తిందో తెలియదు కానీ రామ్ గోపాల్ వర్మకు ఇప్పుడు పని చేయడం పైన శ్రద్ధ లేదు. అందుకే మాటలతో మాయ చేస్తున్నాడు. రోజు రోజుకూ దిగజారుతున్నాడు. ఈ రోజు ఇంకో మెట్టు కిందకు దిగాడు. తన వంగవీటి సినిమాకు అర్జెంట్‌గా పబ్లిసిటీ అవసరమైంది. అందుకే వంగవీటి సినిమా క్యాప్షన్‌ని పవన్‌కి ఆపాదిస్తూ ట్విట్టర్లో కామెంట్ చేశాడు. ‘పవన్ కళ్యాణ్ ఈజ్ ద కైండ్ ఆఫ్ ఎ సూపర్లేటివ్ లీడర్ హూ ఈజ్ ఎ వెరీ వెరీ కమ్మగా కాపు కాసే శక్తి’….ఇదీ వర్మ ట్వీట్. ఆ వెంటనే ‘కమ్మగా అంటే తీపి అని నా ఉద్ధేశ్యం. కొంత మంది మలీషియస్ మైండెడ్ పీపుల్ థింక్ చేస్తున్నట్టుగా కులం గురించి కాదు’ అని కూడా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్స్ చదివిన వెంటనే వచ్చిన ఫీలింగ్… వర్మకంటే మలీషియస్ మైండ్ ఉన్నవాడు ఎవడున్నాడిక్కడ అనే. అయినప్పటికీ ఎన్ని విమర్శలు వచ్చినా అది నాకు ప్లస్సే అనుకుంటూ ఉంటాడు వర్మ. కానీ వర్మ రీసెంట్ సినిమా థియేటర్స్పైన ‘ఎటాక్’ చేసినప్పుడు తెగిన టికెట్స్ ఎన్ని? ఆ సినిమా ప్రొడ్యూసర్ ఇంకా వడ్డీలు ఎందుకు కడుతున్నాడో తెలిసినవాళ్ళు మాత్రం వర్మని చూసి కూడా జాలి పడుతున్నారు.