అమలా పాల్, కంగనా రనౌత్ డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళ అభిప్రాయాలు, ఆలోచనల విషయం పక్కన పెడితే కంగనా అడిగిన ప్రశ్నకు సమాధానం ఉందా? అమలాపాల్-విజయ్‌లకు మనస్పర్థలు వచ్చాయి. విడాకులు తీసుకోవాలనుకున్నారు. నేను చాలా మంచి వాడినని, అమలా వైపే తప్పు ఉంది అన్న అర్థం వచ్చేలా విజయ్ తనను తాను సమర్ధించుకున్నాడు. కానీ విజయ్‌ని మాత్రం అమలా పాల్ ఒక్క మాట కూడా అనలేదు. అయితే మధ్యలో సీన్లోకి ఎంటర్ అయిన విజయ్ తండ్రి మాత్రం ఇష్టం వచ్చినట్టుగా పేలాడు. ఆవేశపడ్డాడు. అమలా పాల్ని కించపర్చాలని ప్రయత్నించాడు. తన స్థాయిని దిగజార్చుకున్నాడు.
హృతిక్ రోషన్-కంగనాల మధ్య కూడా ఏదో ఇష్యూ జరిగింది. ఆ తర్వాత రచ్చ అయింది. ఇద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు చాలా మాటలు అనేసుకున్నారు. ఆ తర్వాత మధ్యవర్తుల మాటలే విన్నారో, లేకపోతే వాళ్ళకు వాళ్ళే రియలైజ్ అయ్యారో తెలియదు కానీ ఇద్దరూ కూడా సైలెంట్ అయ్యారు. అంతా బాగుందనుకుంటున్న తరుణంలో తగుదునమ్మా అంటూ రాకేష్ రోషన్ ఎంటర్ అయిపోయాడు. వాళ్ళ అబ్బాయి (40 దాటేసిన హృతిక్) మౌనంగా అన్నీ భరిస్తున్నాడని, ఒక్క సారి నోరు తెరిస్తే కంగనా జీవితం ఏదో అయిపోతుందన్న అర్థం వచ్చేలా భారీ డైలాగులు పేల్చాడు ఈ బాలీవుడ్ రైటర్ కమ్ డైరెక్టర్. మౌనంగా ఉండటానికి అవతల ఉన్నది అమలాపాల్ కాదు కదా. తెరపైన హాటుగా కనిపించే విషయం పక్కన పెడితే ఆఫ్ ది స్క్రీన్ మాత్రం అందరికీ ఘాటుగానే సమాధానం చెప్పేంత గట్స్ ఉన్న హీరోయిన్. 43ఏళ్ళ కొడుకును కాపాడడానికి ఆయన తండ్రి సీన్లోకి రావాలా? అని ప్రశ్నించింది.
విజయ్ తండ్రి అయినా రాకేష్ రోషన్ అయినా కొడుకులు తప్పు చేయలేదని ఎలా వకాల్తా పుచ్చుకుంటారు? వాళ్ళ వ్యక్తిగత జీవితం మొత్తం వీళ్ళకు తెలుసా? బయట కూడా మనం ఇలాంటి వాళ్ళను చాలా మందిని చూస్తూ ఉంటాం. తమ కొడుకులు బంగారం…ఎదుటి వాళ్ళు బజారు మనుషులు అని విచక్షణ లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు. విమర్శలు చేస్తూ ఉంటారు. అంత బంగారాలైతే కంగనా చూపించిన ఆధారాలకు కూడా సమాధానాలు చెప్పాలిగా. ఇక సున్నితమైన భావోద్వేగాల నేపధ్యంలో చాలా మంచి సినిమాలు తీసిన విజయ్‌గారు కూడా అమలా పాల్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడాడు. ఏం జరిగినా, ఏం చేసినా తనను నమ్మి తన కోసం వచ్చిన మనిషి గురించి అందరికీ తెలిసేలా మీడియా ముందు చెడుగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? నేను పతిత్తుని అని చెప్పుకోవాలన్న తాపత్రయం ఎందుకు? అలాంటి విజయ్‌తో పోలిస్తే ఇప్పటి వరకూ విజయ్‌ని ఒక్క మాట కూడా అనని అమలా పాల్ది ఎంత గొప్ప వ్యక్తిత్వం. కలిసున్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు ఆల్ ఈజ్ వెల్, అంతా మంచి వాళ్ళే అన్నట్టు ఉంటుంది వ్యవహారం. విడిపోయినప్పుడు, గొడవలు స్టార్ట్ అయినప్పుడే మనుషుల అసలు రంగులు తెలుస్తాయి. కొంతమంది మాత్రం ఇలా వాళ్ళ రంగులను వాళ్ళే బయట పెట్టుకుంటూ ఉంటారు.