టీం ఇండియా సాధించేసింది. వెస్టిండీస్ సిరీస్‌లో వర్షం పుణ్యమాని తమ చేతుల్లో నుంచి జారిపోయిన నంబర్ ఒన్ ర్యాంక్‌ని మళ్ళీ గెలుచుకుంది. పాకిస్తాన్‌కి ఝలక్ ఇచ్చింది. ఎప్పుడు ఎలా స్పందిస్తుందో తెలియని బౌలింగ్ పిచ్‌పై సమిష్టి ప్రదర్శనతో కోహ్లిసేన న్యూజిలాండ్‌ని చిత్తు చేసింది. టీంలో ఉన్న ప్రతి ప్లేయర్ కూడా గెలవాలన్న కసితో పాటు, వ్యూహాత్మకంగా ప్లాన్ చేసి న్యూజిలాండ్‌ని దెబ్బతీశారు. చివరి ఇన్నింగ్స్‌లో కూడా, కోల్‌కతా వేదికగా ఇంతవరకూ ఎవ్వరూ సాధించలేకపోయినంత భారీ టార్గెట్‌ని ఎదురుగా పెట్టుకుని కూడా బ్లాక్ క్యాప్స్ మాత్రం అంత ఈజీగా మ్యాచ్‌ని వదిలేయలేదు. న్యూజిలాండ్ ఓపెనర్ లాథం అయితే ఇండియన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 74 పరుగులు సాధించాడు. మిగతా టీం మెంబర్స్ నుంచి సరైన సపోర్ట్ లేకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. ఆ టీం కెప్టెన్, అత్యంత అనుభవజ్ఙుడు అయిన రాస్ టేలర్ 4 పరుగులకే వెనుదిరగడంతో పాటు 24 పరుగులు చేసి నిలదొక్కుకున్నట్టుగా కనిపించిన ఆ టీం ప్రధాన బ్యాట్స్‌మెన్ కూడా భారత బౌలర్ల సమిష్టి కృషి ముందు నిలబడలేకపోయారు. కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యూహాలు కూడా అద్భుతంగా పనిచేశాయి. ఒక టైంలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి వంద పరుగులతో నిలిచింది న్యూజిలాండ్. అయినప్పటికీ గేంని తన చేతుల్లో నుంచి జారిపోకుండా కాపాడుకోవడంలో కోహ్లి సేన సక్సెస్ అయింది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంకో టెస్ట్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ గెల్చుకుంది. పాకిస్తాన్ నుంచి నంబర్ ఒన్ ర్యాంక్ కూడా లాగేసుకుంది.