వ్యవస్థలో సమూల ప్రక్షాళన దిశగా తీసుకున్న పెద్ద నోట్ల నిర్ణయాన్ని గుడ్డిగా వ్యతిరేకించడం సబబు కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి చెప్పారు. శనివారం శాసన మండలిలో ఈ అంశంపై చర్చ సందర్భంగా ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ సభ్యులు రాజకీయ కారణాలతోఈ నిర్ణయాన్ని పదే పదే తప్పు పడుతూ మాట్లాడటాన్ని కేసీఆర్ వ్యతిరేకించారు.
దేశంలో అవినీతి, నల్లధనాన్ని నిర్మూలించడంలో ఇది తొలి ప్రయత్నంగా కేసీఆర్ అభివర్ణించారు. దీనివల్ల మొదట్లో ఇబ్బందులు ఉంటాయని ప్రధాని మోడీ స్వయంగా చెప్పారు. ఆయన అడిగిన 50 రోజులూ ఇచ్చి చూద్దాం. సరిగ్గా అమలైతే దేశంలో అద్భుతమైన మార్పులు వస్తాయని కేసీఆర్ అన్నారు. రాజకీయ అవినీతి అంతం కావాలంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడు రాజకీయాలన్నా రాజకీయ నాయకులన్నా చులకన భావం ఉంది. మన మీద రోజూ ఎన్ని జోకులు, కార్టూన్లు వస్తున్నాయో చూస్తున్నాం. భవిష్యత్తులో రాజకీయ అవినీతి అంతమైతే మనందరికీ మంచిపేరు వస్తుంది. మనకు గౌరవం పెరుగుతుంది. జనం మనల్ని చులకన చేయడం ఆగుతుందని అన్నారు.
నగదు రహితం అనేది వంద శాతం కానేకాదన్నారు. వీలైనంత ఎక్కువగా నగదు రహిత లావాదేవీలు చేయడం నేటి అవసరం అని చెప్పారు. సిద్దిపేట నియోజక వర్గంలో ఒక గ్రామంలో నూరు శాతం క్యాష్ లెస్ లావాదేవీలు చేస్తున్నారని చెప్పారు. మనసుంటే మార్గం ఉంటుందనడానికి ఇది ఉదాహరణ అన్నారు.
15 ఏళ్ల క్రితం మొబైల్ ఫోన్ ఎంత మందికి తెలుసు? ఇప్పుడు మొబైల్ ఫోన్ వాడని వాళ్లు ఉన్నారా? చదువు రాని వాళ్లుకూడా సెల్ ఫోన్ ఎలా వాడుతున్నారు? నేర్చుకుంటే వచ్చింది. నగదు రహిత విధానం కూడా అంతే. దీనికి బదులు ప్రజల్ని భయభ్రాంతులక గురిచేసేలా ప్రతిపక్షాలు మాట్లాడ వద్దని కేసీఆర్ హితవు పలికారు. మంచి జరుగుతుందనే ఆశ ఉన్నప్పుడు అందరం సహకరిద్దామని సూచించారు. రాజకీయాలకు అతీతంగా మంచిని సమర్థిస్తానన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ తరహాలోనే కేసీఆర్ మాట్లాడారు.