ముగిసిన అసెంబ్లీ సెషన్: అడ్వాంటేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్

హైదరాబాద్: ఐదురోజులపాటు సాగిన ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టితో ముగిశాయి. ఈ సమావేశాలలో సభను ఆద్యంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డామినేట్ చేసిందని చెప్పాలి. పార్టీ అధినేత జగన్‌సహా వైసీపీ సభ్యులు చేసిన ఎదురుదాడికి అధికారపార్టీ సభ్యులు దీటుగా ప్రతిస్పందించలేకపోయారు. మొదటిరోజు పుష్కర్ ఘాట్ మృతులకు సంతాపం ప్రకటించటం దగ్గరనుంచి మొదలుపెట్టి వైసీపీ సభ్యులు ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకున్నారు. మధ్యలో ఒకరోజున జగన్ ఇడుపులపాయలో తన తండ్రికి నివాళులర్పించటానికి వెళ్ళటంతో ఆ ఒక్కరోజుమాత్రం అధికారపార్టీ సభ్యులు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఇక చివరిరోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ తమ బ్రహ్మాస్త్రాన్ని తీసింది. ఓటుకు నోటు కేసు అంశంపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే స్పీకర్ కోడెల శివప్రసాదరావు దానిని తిరస్కరించారు. ఇక సినిమా మొదలయింది.

ఓటుకు నోటుపై చర్చకు అనుమతించాల్సిందేనంటూ వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. మంత్రి అచ్చెన్నాయుడు లేచి, నిన్న కేసీఆర్ జగన్‌కు ఫోన్ చేసి ఇంకా సభలో ఓటుకు నోటు అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని అడిగినట్లు తమకు తెలిసిందని, అందుకే సమావేశాల చివరి రోజున వైసీపీ ఈ అంశాన్ని సభలో ప్రస్తావించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని ఆరోపించారు. 11 కేసుల్లో ఏ-1 ముద్దాయిగా ఉండి, కోర్టు అనుమతిస్తే సభకు వచ్చిన జగన్‌కు ఇతర కేసులను ప్రస్తావించే అర్హత లేదని అన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ సభను పదినిమిషాలపాటు వాయిదా వేశారు.

సభ తిరిగి సమావేశమైన తర్వాత జగన్ అచ్చెన్నాయుడు ఆరోపణలపై స్పందించారు. కేసీఆర్ తనకు ఫోన్ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. గతంలో చంద్రబాబే కేసీఆర్‌తో పొత్తు పెట్టుకున్నారంటూ పాత ఫోటోలుకూడా చూపించారు. ఓటుకు నోటు కేసును రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ‘దొంగ దొరకటం తప్పుకాదు – పట్టుకోవటం తప్పు’ అన్నట్లుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేసులో బయటపడిన ఆడియోలో మాట్లాడింది చంద్రబాబు అవునా, కాదా అని చెప్పాలని అన్నారు. రేవంత్‌రెడ్డికి డబ్బు ఇచ్చి పంపింది చంద్రబాబు అవునా కాదా అని చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై సభలో మాట్లాడకూడదని స్పీకర్ చెప్పినప్పుడు జగన్ మంచి పాయింట్ లేవదీశారు. ప్రతిరోజూ తనపైనున్న కేసులను టీడీపీ సభ్యులు ప్రస్తావిస్తున్నపుడు లేని అభ్యంతరం, ఓటుకు నోటు కేసు విషయంలో ఎందుకు వస్తుందని స్పీకర్‌ను అడిగారు. చివరికి చనిపోయిన తన తండ్రిపైకూడా ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పేరును ఛార్జిషీట్‌లో 22సార్లు ప్రస్తావించారని అన్నారు. శాసనసభలో తనపై ఎలాంటి ఆరోపణలు చేయటానికయినా అవకాశం ఇస్తారని, తమకుమాత్రం అవకాశం ఇవ్వరని స్పీకర్‌పై ఆరోపణలు చేశారు. జగన్ మాట్లాడుతుండగానే స్పీకర్ కోడెల ఇక ప్రశ్నోత్తరాలకు వెళదామని అన్నారు. విపక్ష ఎమ్మెల్యేలు అంగీకరించలేదు.

ఇక అధికారపక్షం ఎదురుదాడిని చూస్తే – అవినీతిపై జగన్ మాట్లాడటం దశాబ్దంలోనే పెద్ద జోక్ అని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. అవినీతి మొత్తం పేటెంట్ జగన్‌దేనని చెప్పారు. ధూళిపాళ నరేంద్ర మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు తూట్లు పొడుస్తూ, ఏపీకి చెందిన అధికారుల ఫోన్లను ట్యాప్ చేసినా నోరెందుకు విప్పలేదని జగన్‌ను అడిగారు. హైదరాబాద్‌లో సీమాంధ్రుల పరిరక్షణకు ఉద్దేశించిన సెక్షన్ 8 అమలుకు సంబంధించి చర్చ జరిగినపుడు జగన్ ఎక్కడికి పారిపోయారని ప్రశ్నించారు. మరోవైపు ఓటుకు నోటు కేసుమీద ప్రతిపక్షం గొడవ చేస్తారనో, ఏమో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సభకు రాలేదు.

మొత్తంమీదచూస్తే ప్రతిపక్షదాడిని దీటుగా ఎదుర్కొనేసభ్యులు అధికారపార్టీలో లేకపోవటం వారి లోటుగా కనిపిస్తోంది. అచ్చెన్నాయుడు, బొండా ఉమామహేశ్వరరావు, కాల్వ శ్రీనివాసులు తప్పితే మిగిలినవారెవరూ వైసీపీ దాడిని గట్టిగా తిప్పికొట్టలేకపోతున్నారు. అటు వైసీపీ వైపేమో, జగన్ దగ్గరనుంచి మొదలుపెడితే చెవిరెడ్డి, రోజా, కొడాలి నాని, గొట్టిపాటి వంటి సభ్యులు అధికార పార్టీపై ఒంటికాలిమీద లేస్తూ దాడి చేస్తున్నారు. ఆ పార్టీలో అధికంగా ఉన్న యువ ఎమ్మెల్యేలు… అందులోనూ రాయలసీమవారు ప్రభుత్వంపై దాడికి ఎవర్‌రెడీగా ఉంటున్నారు. దానికితోడు జగన్ ఏదైనా ఇష్యూ వస్తే తమవారిని చేయిచూపిస్తూ మరీ పోడియం దగ్గరకు వెళ్ళమని ఉసిగొల్పుతున్నారు. వైఎస్ హయాంలో తెలుగుదేశంవైపునుంచి రేవంత్ రెడ్డి, పయ్యావుల, దేవినేని ఉమా, ధూళిపాళ బాగా దూకుడుగా ఉండేవారు… అధికారపక్షాన్ని దీటుగా ఎదుర్కొనేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణలోకెళ్ళిపోవటం, పయ్యావుల గెలవకపోవటం టీడీపీకి లోటే. దేవినేని ఉమా, ధూళిపాళ నరేంద్ర ఎందుకనో గత స్థాయిలో దూకుడుగా లేరనే చెప్పాలి. ఏది ఏమైనా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టటంలో, సభను తమ అధీనంలోకి తీసుకోవటంలో వైసీపీ విజయవంతమైందని చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close