తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు ఎంత ఘోరంగా ఉంటాయో.. అజహర్‌కు మంత్రి పదవి.. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులకు కేబినెట్ హోదా పదవులతో మరోసారి స్పష్టమయింది. చేసింది చాలక మళ్లీ నవంబర్ లో మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉంటాయని మీడియాకు లీకులు ఇస్తున్నారు. ఇంత కలగాపులగంగా పార్టీ తరపున నిర్ణయాలు తీసుకుటూంటే..ఎవరికైనా విరక్తి పుట్టకుండా ఎలా ఉంటుంది ?
అజహర్‌కు అంత అర్జంట్‌గా మంత్రి పదవి ఎందుకు?
ముస్లిం మైనార్టీని మంత్రివర్గంలోకి తీసుకుంటే జూబ్లిహిల్స్ లో మైనార్టీలు ఓట్ల వర్షం కురిపిస్తారని ఎవరు కాంగ్రెస్ అధినాయకత్వానికి సలహా ఇచ్చారో .. అది నిజమని ఎందుకనుకున్నారో కానీ వెంటనే అమలు చేసేశారు. అజర్ వద్ద ఒక్క ఓటు అదనంగా కాంగ్రెస్ పార్టీకి వస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. మరి ఎందుకు పదవి ఇచ్చారో ఎవరికీ తెలియదు. ఆయనకు పదవి ఇవ్వడం వల్ల సీనియర్ ముస్లిం లీడర్లు అసంతృప్తికి గురయ్యారు. ఓ వర్గంలో ఓ నేతకు మంత్రిపదవి ఇస్తే ఆ వర్గం అంతా ఓట్లు వేస్తుందనుకోవడం భ్రమ.
పార్టీ నేతల్ని క్రమశిక్షణలో పెట్టుకోవడం కూడా చేత కాదా !
ఓ వైపు పార్టీ నేతలు గీత దాటిపోతున్నారు. పదవుల కోసం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రిని కించ పరుస్తున్నారు. కానీ వారిపై చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ఒక్క అడుగు కూడా మందుకు పడటం లేదు. ముుఖ్యమంత్రిని కించ పరిచేవారిని సహించి వదిలేస్తే..ఇక పార్టీకి గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది..?. ఈ చిన్న లాజిక్ ను కాంగ్రెస్ పార్టీ పెద్దలు మర్చిపోయారు. ముఖ్యమంత్రిని ఎంత బలంగా చేస్తే కాంగ్రెస్ అంతా పడుతుంది. ఆ విషయాన్ని మర్చిపోయారు.
హైకమాండ్ తత్తర, బిత్తర రాజకీయాలు
కాంగ్రెస్ పార్టీలో ఒక్కరికీ సొంత నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉండదు. ఢిల్లీలో ఉన్న కొంత మంది కూర్చుని తమ గోక్కున్నప్పుడో.. మోకాలు తడుముకున్నప్పుడో వచ్చిన ఆలోచనల్ని అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ వారికి అమలు చేయడం తప్ప మరో ఆప్షన్ ఉండదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఘోరంగా మారడానికి హైకమాండ్ నిర్ణయాలే కారణమన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయినా ఇంకాఇంకా అదే తరహా రాజకీయాలతో వెళ్తున్నారు. కాంగ్రెస్ లో అంతే అనుకునేలా చేస్తున్నారు.
