వైఎస్ వివేకా హత్య కేసులో జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ముందు వాచ్మెన్ రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం అంటూ… కొన్ని అంశాలను మీడియా హైలెట్ చేసింది. పులివెందుల మేజిస్ట్రేట్ మందు.. రంగన్నఒక్కరే ఉండగా స్టేట్ మెంట్ ఇచ్చారని చెబుతున్నారు. అలాంటి సమయంలో వివరాలు ఎలా బయటకు వస్తాయో కానీ.. రూ. ఎనిమిది కోట్ల సుపారీ ఇచ్చారని… ఇద్దరు ప్రముఖులు ఉన్నారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రంగయ్య .. పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనను సీబీఐ అధికారులు రాత్రి పూట తీసుకు వచ్చి పులివెందుల బస్టాండ్లో వదిలి రూ. పదిహేను వందలు చేతిలో పెట్టి ఇంటికి వెళ్లమని చెప్పి పంపేశారు.
మీడియాలో అప్పటికే రంగయ్య స్టేట్మెంట్ గురించి ప్రచారం కావడంతో ఆయన గురించి తెలిసిన వారు… చుట్టుముట్టి రకరకాల ప్రశ్నలు వేశారు. వాటికి రంగయ్యసమాధానాలిచ్చారు. తన గురించి బయటకు చెబితే నరికేస్తానని ఎర్రగంగిరెడ్డి హెచ్చరిస్తున్నారని.. అయినా పెద్ద సార్లకు వివరాలు చెప్పానని చెప్పుకొచ్చారు. అయితే మేజిస్ట్రేట్ ముందు ఏం చెప్పానో గుర్తు లేదని కూడా చెప్పుకొచ్చారు. ఈ వీడియోలు మీడియాలో హైలెట్ అయ్యాయి. అయితే.. రంగయ్య ఇంటి వాచ్మెన్ మాత్రమే.. ఇంట్లోకి కొత్త వాళ్లు ఎవరు వచ్చారు… హత్య జరిగిన తర్వాత వచ్చిన వారు ఏం చేశారు..? లాంటివి మాత్రమే ఆయన చెప్పగలరు. కానీ రూ. ఎనిమిది కోట్ల సుపారీకి మాట్లాడుకున్నారని.. అది ఇద్దరు ప్రముఖులేనని తెలిసే అవకాశం లేదు. అది సీబీఐ విచారణలో తేలాల్సి ఉంది. అయితే సుపారీ గురించి కూడా… రంగయ్య స్టేట్మెంట్ ఇచ్చారన్న ప్రచారం మీడియాలో జరుగుతోంది.
అయితే.. సీబీఐ దర్యాప్తు అధికారిని మార్చిన రోజే.. ఈ వ్యవహారం బయటకు రావడం సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. కేసును అటు కర్ర విరగకుండా.. ఇటు పాము చావకుండా.. ఓ ముగింపునకు తీసుకు రావడానికి సీబీఐ ప్లాన్ చేస్తోందని విపక్షాలు విమర్శలు ప్రారంభిస్తున్నాయి. అదే పనిగా వాచ్మెన్ రంగయ్యను రోజుల తరబడి విచారించి…. ఆయన ఇలా అందరితోనూ మాట్లాడేలా చేయడం ఏమిటన్న చర్చ వినిపిస్తోంది. మొత్తానికి వివేకా మృతిని మొదట గుండెపోటుగా నమ్మించాలనుకున్న వారు.. పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చేదాకా హత్య అని చెప్పని వారు… సాక్ష్యాలు తుడిచేసిన వారు అందరూ.. సేఫ్గా ఉడే అవకాశం కనిపిస్తోదంి. ఎర్ర గంగిరెడ్డి లాంటి కొంత మందిని ఫిక్స్ చేసి కేసుకు ముగింపునిచ్చే ప్రయత్నం చేస్తున్నారని.. విపక్ష నేతలు ఆరోపించడం సహజమే.