ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిని పక్కన పెడితే నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు రాహుల్ నాయకత్వానికి మరో పరీక్షగా మారబోతున్నాయి. ఇంత కాలం కాంగ్రెస్ తాను ఓడటమేకాకుండా మిత్రపక్షాలను కూడా ఓడిస్తోందన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు అలాంటివి జరగకుండా తాను గెలిచి.. ఇతరుల్ని గెలిపించాల్సి ఉంది.
కేరళ గెలుపు ముందు బోర్లా పడుతుందా ?
కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ పరిస్థితి సందిగ్ధంలో ఉంది. వరుసగా రెండుసార్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్, ఈసారి ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. అయితే, పార్టీలో అంతర్గత విభేదాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇటీవల తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కీలక వ్యూహరచన సమావేశాలకు దూరం కావడం పార్టీలో ముఠా రాజకీయాలను బయటపెట్టింది. హైకమాండ్ ఇప్పటికే మెరిట్ ఆధారంగానే టిక్కెట్లు ఇస్తామని, ఓడిపోయిన వారికి రెండో అవకాశం ఉండదని హెచ్చరించడం ద్వారా కేడర్లో సీరియస్నెస్ పెంచే ప్రయత్నం చేస్తోంది. స్థానికఎన్నికల్లో విజయాలు సాధించి.. గట్టి ఆశలు పెట్టుకుంది. ప్రియాంక ప్రస్తుతం కేరళ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో రాహుల్ ఎంపీగా గెలిచినా రాజీనామా చేసి సోదరికి చాన్సిచ్చారు.
తమిళనాడులో డీఎంకేతో సీట్ల లొల్లి
తమిళనాడులో కాంగ్రెస్ అధికార డీఎంకే తో పొత్తులో ఉంది. 2021 విజయాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నప్పటికీ, సీట్ల సర్దుబాటు విషయంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. కాంగ్రెస్ 40కి పైగా స్థానాలు డిమాండ్ చేస్తుండగా, డీఎంకే మాత్రం తక్కువ సీట్లే ఇచ్చేందుకు మొగ్గు చూపుతోంది. విజయ్ వంటి కొత్త తారల రాజకీయ ప్రవేశం కూడా ఇక్కడి సమీకరణాలను మారుస్తోంది. మిత్రపక్షాల ఒత్తిడిని తట్టుకుని గౌరవప్రదమైన స్థానాలను సాధించుకోవడం కాంగ్రెస్కు ఇప్పుడున్న ప్రధాన సవాలు. అదే సమయంలో రాజకీయ రచ్చ చేయకుండా కూటమి విలువను కాపాడుకోవాల్సిఉంది.
అస్సాంలో నాయకత్వ లేమి
అస్సాంలో హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని బిజెపిని ఎదుర్కోవడం కాంగ్రెస్కు కత్తిమీద సాములా మారింది. ఏఐయూడీఎఫ్ వంటి పార్టీలతో పొత్తులు తెంచుకున్న తర్వాత కాంగ్రెస్ ఒంటరి పోరాటం చేస్తోంది. ప్రియాంకా గాంధీ స్వయంగా రంగంలోకి దిగి అభ్యర్థుల ఎంపికను పర్యవేక్షిస్తున్నప్పటికీ, పార్టీ నేతల వరుస ఫిరాయింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. గౌరవ్ గొగోయ్ వంటి యువ నేతలు పోరాడుతున్నా, వ్యవస్థాగత లోపాలు పార్టీని వేధిస్తున్నాయి.మాజీ పీసీసీ చీఫ్ భూపేనాబోరా.. రాహుల్ బతిమాలినా పార్టీలో ఉండకుండా బీజేపీలో చేరిపోయారు.
పశ్చిమ బెంగాల్ లో నామమాత్రపు పాత్ర?
బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బిజెపిల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇండియా కూటమిలో భాగస్వామి అయినప్పటికీ, బెంగాల్లో మమతా బెనర్జీతో కాంగ్రెస్కు పొత్తు కుదరడం లేదు. వామపక్షాలతో కలిసి పోటీ చేసినా, ఓటు బ్యాంకును నిలబెట్టుకోవడం ఇక్కడ కాంగ్రెస్కు పెద్ద పరీక్ష. ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఒకవైపు అధికార పార్టీల బలాన్ని, మరోవైపు బిజెపి దూకుడును ఎదుర్కోవాల్సి ఉంది. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి, క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తే తప్ప కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావడం కష్టమనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రాహుల్ ఈ టాస్క్ మాస్టర్ లాగా వ్యవహరించాల్సి ఉంది. కానీ ఆయన కోటరీకే పనులు అప్పచెబుతున్నారు.
