ఆ రెండు పార్టీల‌కూ టీడీపీ అవ‌స‌రాన్ని చెప్పిన‌ ఆంధ్ర‌జ్యోతి!

టీడీపికి సంబంధించి రెండు ముఖ్య‌మైన అంశాలు ఏంటంటే… ఒక‌టీ ఆంధ్రాలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచుకోవ‌డం, మ‌రొక‌టి తెలంగాణ‌లో పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డం! ఈ రెండూ తెలుగుదేశం పార్టీకి అత్య‌వ‌స‌ర ప్రాధాన్యంతాంశాలు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. కేంద్రం మూల‌న ప‌డేసిందీ అనుకున్న సీట్ల పెంపు వ్య‌వ‌హారాన్ని మ‌ళ్లీ తెర‌మీదికి ఏపీ సీఎం చంద్ర‌బాబు తెచ్చారు. శుక్ర‌వారం ఢిల్లీ వెళ్లి, కేంద్ర పెద్ద‌ల‌తో మ‌రోసారి చ‌ర్చించి వ‌చ్చారు. భాజ‌పా నుంచి సానుకూల సంకేతాలు ఉన్నాయ‌ని చెప్పుకొచ్చారు. గ‌త‌వారంలోనే చంద్రబాబు హైద‌రాబాద్ కూడా వ‌చ్చారు. రేవంత్ రెడ్డి పార్టీ విడిచి వెళ్లిన త‌రువాత‌.. కార్య‌క‌ర్త‌ల‌కు ‘నేనున్నా’ అంటూ భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. కార్య‌క‌ర్త‌ల‌తో త‌న‌కున్న అవిభాజ్య ఆనువంశిక‌ రక్త సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ ప‌రిస్థితుల‌ను త‌న‌దైన శైలిలో రిపేర్ చేసుకునే ప్ర‌య‌త్నంలో చంద్ర‌బాబు ఉన్నారు. కానీ, ఈ రెండింటికీ ఓ అద్భుత‌మైన ప‌రిష్కారం చూపించే ప్ర‌య‌త్నం ఆంధ్ర‌జ్యోతి చేసింది! ఈ రెండింటిలో ఒక‌టి తెరాస స‌మ‌స్య‌గా, మ‌రొక‌టి భాజ‌పా స‌మ‌స్య‌గా విశ్లేషించింది.

ముందుగా, ఆంధ్రా వ్య‌వ‌హారాల గురించి మాట్లాడుకుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భాజ‌పాతో టీడీపీ పొత్తు ఉంటుందో లేదో అనే స్ప‌ష్ట‌త లేదు. కానీ, ప్ర‌స్తుతం నియోజ‌క వ‌ర్గాల‌ పెంపు వ్య‌వ‌హారం తెరమీదికి వచ్చిన త‌రుణంలో.. ఆంధ్రాలో టీడీపీతోనే భాజ‌పా పొత్తు కొన‌సాగాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను ఓ క‌థ‌నంలో ప్ర‌స్థావించారు. ‘ఆంధ్రాలో తెలుగుదేశం సుస్థిరంగా ఉంది కాబ‌ట్టి, ఇక్క‌డ మిత్ర‌ప‌క్షంగా కొన‌సాగుతూ సీట్ల సంఖ్య‌ను పెంచితే… పొత్తులో భాగంగా అధిక స్థానాలు ద‌క్కించుకోవ‌చ్చ‌న్న‌ది భాజ‌పా నేత‌ల మ‌నోగ‌తంగా ఆంధ్ర‌జ్యోతికి తెలిసింద‌ట‌’! టీడీపీ కోరిక‌ను మ‌న్నించ‌డం ద్వారా ఆంధ్రాలో భాజపా స్థానాలు పెంచుకోవ‌చ్చ‌నే అభిప్రాయంతో వారు ఉన్నార‌ట‌! ఈ ప్రెజెంటేష‌న్ ఎలా ఉందంటే… ఏపీ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచ‌క‌పోతే భాజ‌పా ఇబ్బంది ప‌డిపోతుంద‌న్న‌ట్టుగా. స్థానాల నంబర్ పెంచ‌క‌పోతే తామే న‌ష్ట‌పోతామ‌ని భాజ‌పా బెంగ‌పెట్టుకుంటున్న‌ట్టుగా ఉంది. స‌రే.. వాస్త‌వ ప‌రిస్థితి ఏంట‌నేది చివ‌ర్లో మాట్లాడుకుందాం!

ఇక‌, తెలంగాణ వ్య‌వ‌హారాల గురించి మాట్లాడుకుంటే… రేవంత్ నిష్క్ర‌మ‌ణ‌తో రాష్ట్రంలో టీడీపీ ప‌రిస్థితి డోల‌యామానంలో ఉంది. హైద‌రాబాద్ లో చంద్ర‌బాబు ఏర్పాటు చేసిన స‌మావేశానికి అనూహ్య స్థాయిలో కార్య‌క‌ర్త‌లు త‌ర‌లి రావ‌డాన్ని… టీడీపీకి తెలంగాణ‌లో ఉన్న పునాది బ‌లంగా చెప్పారు, ఓకే! అయితే, తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ లోకి వ‌ల‌స‌లు పెరుగుతూ ఉండ‌టం వ‌ల్ల ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవేద‌న పెరుగుతోంద‌ట‌. తెరాస‌లోకి చేరిక‌లు పెంచ‌క‌పోయినా ఫ‌ర్వాలేదూగానీ… కాంగ్రెస్ లోకి వ‌ల‌స‌ల్ని ఆపాల‌నేది కేసీఆర్ ఆదేశంగా మ‌రో క‌థ‌నంలో చెప్పారు. గ‌మ్మ‌త్తైన పాయింట్ ఇప్పుడు చెప్పుకుంటే… ‘వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార తెరాస‌తో టీడీపీ పొత్తు ఉంటుంద‌న్న భ‌రోసా క‌ల్పిస్తే… కాంగ్రెస్ లోకి వ‌ల‌స‌లు నిరోధించొచ్చు అనేది కేసీఆర్ వ్యూహంగా’ ఆంధ్ర‌జ్యోతికి క‌నిపిస్తోంద‌ట‌’! అందుకే… టీడీపీతో పొత్తు సంకేతాల‌ను తెరాస ఇస్తోంద‌ని చాలా క‌న్వెన్సింగ్ గా రాశారు. అంటే, వ‌ల‌స‌ల్ని త‌ట్టుకోవాలంటే టీడీపీతో పొత్తు వినా కేసీఆర్ కు దిక్కుతోచ‌డం లేద‌న్న‌మాట‌! స‌రే.. వాస్త‌వ ప‌రిస్థితులు ఏంట‌నేది చివ‌ర్లో మాట్లాడుకుందాం!

ఆంధ్రాలో సీట్ల పెంప‌కం వ్య‌వ‌హారం గురించి మాట్లాడుకుంటే… ఎడాపెడా ఫిరాయింపుల్ని చంద్ర‌బాబు ప్రోత్స‌హించేశారు. చాలా నియోజ‌క వ‌ర్గాల్లో రెండు మించిన వేరు కుంప‌ట్లు రాజేసి పెట్టారు. జంప్ జిలానీలంద‌రికీ హామీలు ఇచ్చేశారు. ఇప్పుడు అంద‌ర్నీ సంతృప్తిప‌ర‌చాలంటే.. సీట్ల సంఖ్య పెంప‌క‌మే దిక్కు. ఎలాగూ విభ‌జ‌న చ‌ట్టంలో దీనికి సంబంధించి ఓ మాట కూడా ఉంది కాబ‌ట్టి, కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సో… దీంతో భాజ‌పాకి ఏంటి సంబంధం చెప్పండీ..? ఇది భాజ‌పా తల‌నొప్పి కానే కాదు. ఆంధ్రాలో సీట్లు పెంచాలా వ‌ద్ద‌ా అనేదానిపై భాజ‌పా లెక్క‌లు వేరేగా ఉంటాయి. సీట్లు పెంచితే మాకేంటి అన్న‌ట్టుగానే భాజ‌పా ఆలోచిస్తుంది. అంతేగానీ, టీడీపీతో పొత్తు ఉంచుకోవాల‌న్న తహతహల కోణం నుంచి ఈ వ్య‌వ‌హారాన్ని భాజ‌పా చూడ‌దు క‌దా..!

ఇక‌, తెలంగాణ‌లో పొత్తుల‌ వ్య‌వ‌హారానికి వ‌స్తే… ఇక్క‌డ భాజ‌పాతో టీడీపీకి పొత్తు అవ‌స‌ర్లేదు! ఆ ఆరాటం టీడీపీలో కూడా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే, తెరాస‌కు గ‌ట్టి పోటీ ఇచ్చే స్థాయికి కాంగ్రెస్ నెమ్మ‌దిగా చేరుకుంటోంది. రాష్ట్రంలో భాజ‌పాది ఏ మూడో స్థాన‌మో. కాబ‌ట్టి, ఇక్క‌డ భాజ‌పాతో టీడీపీ పొత్తు అంటే.. జోగీ జోగీ పూసుకున్న‌ట్టే. ఇంకోప‌క్క రేవంత్ వెళ్లిపోవ‌డంతో టీ టీడీపీ అంప‌శ‌య్య మీద‌కి వ‌చ్చేసింది. ఇలాంట‌ప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెరాస‌తో పొత్తు కుదిరితే టీడీపీకి ఇంకా నూక‌లు మిగిలిన‌ట్టు అవుతుంది. కాబట్టి, తెరాసతో పొత్తు అనేది టీడీపీ అవసరంగా కనిపిస్తోంది. ట్ర‌స్ట్ భ‌వ‌న్ లో చంద్ర‌బాబు మీటింగ్ కి ఆరు వేల మంది కార్య‌క‌ర్త‌లు త‌ర‌లి వ‌చ్చినంత మాత్రాన తెలంగాణ‌లో టీడీపీ చాలా బ‌లంగానే ఉంద‌ని తెగేసి చెప్ప‌లేం క‌దా!

సీట్ల పెంపు విష‌యంలోగానీ, తెలంగాణ‌లో పార్టీ భ‌విష్య‌త్తు విష‌య‌మైగానీ తెలుగుదేశంలో అంత‌ర్మ‌థ‌నం జ‌రుగుతుంద‌నేది వాస్త‌వం. ఈ రెండూ తెలుగు రాష్ట్రాల్లో పార్టీ మ‌నుగ‌డ‌పై ప్ర‌భావితం చూపే అంశాలే. కానీ, ఈ రెండింటినీ ఆంధ్ర‌జ్యోతి మ‌రోలా చూపించింది. సీట్ల పెంపుపై నిర్ణ‌యం తీసుకోక‌పోతే వారికే న‌ష్ట‌మ‌ని భాజ‌పాకి సంకేతాలు ఇచ్చిన‌ట్టు, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ ను బ‌ల‌హీన ప‌రచొచ్చ‌ని తెరాస‌కు దిశానిర్దేశం చేసిన‌ట్టుగా ఉంది!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com