కోమటిరెడ్డి, మహిళా ఐఏఎస్‌లకు వివాహేతర బంధాలు అంటగట్టేంత కథనాలు రాసిన ఎన్టీవీ, వెంటనే అధికారుల సంఘాలు సీరియస్ గా తీసుకుని అరెస్టులు చేసిన వ్యవహారం వెనుక ఉన్న గూడుపుఠాణి మొత్తాన్ని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన వారాంతాపు పలుకు .. కొత్తపలుకులో వెల్లడించారు. ఆయన చాలా కొత్త విషయాన్ని చెప్పారు. ఇప్పటి వరకూ రకరకాల ప్రచారం జరిగింది కానీ ఈ కథనాల వెనుక అసలు మ్యాటర్ సింగరేణికి ఒరిస్సాలోని నైనిలో ఉన్న బొగ్గుగనిలో ..బొగ్గు తవ్వకం టెండర్ వ్యవహారట.
ఈ టెండర్ కోసం కోమటిరెడ్డి తన తమ్ముడి కంపెనీని రంగంలోకి దించారు. అటు భట్టి విక్రమార్కకు అన్నీ తాను అయినట్లుగా వ్యవహరిస్తున్న ఎన్టీవీ చౌదరి తన అల్లుడి కంపెనీని ముందుకు తెచ్చారు. ఈయన కంపెనీకి అర్హత లేదు కాబట్టి మేఘా కంపెనీని తోడుగా పెట్టుకుని జాయింట్ వెంచర్ అన్నారు. ఈ రెండు కంపెనీల మధ్య పీకులాటలో కోమటిరెడ్డిని డీఫేమ్ చేయడానికి అక్రమ సంబంధాలు అంటగట్టారు ఎన్టీవీ చౌదరి. అది చినికి చినికి గాలివాన అయింది. ఆర్కే ఏం పీకులాటలు పెట్టుకోలేదు అన్నీ బహిరంగంగానే చెప్పారు. ఇందులో తప్పులు ఉంటే .. ఆయనపై అందరూ ఎదురుదాడి చేస్తారు. సైలెంటుగా ఉంటే మాత్రం.. కదిపితే మొత్తం ఎక్కడ బయటకు వస్తాయో అని తేలుకుట్టిన దొంగల్లా ఉంటారు.
ఈ వారం కొత్త పలుకులో ఆర్కే చెప్పిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అసలు ఈ ఘటన.. జరిగిన పరిణామాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు పట్టించుకోలేదట. సిట్ ఏర్పాటు చేయాలన్నది కూడా ఉన్నతాధికారులే నిర్ణయం తీసుకున్నారు. అరెస్టుల నిర్ణయం కూడా వారిదే. ముఖ్యమంత్రి అలా సినిమా చూస్తూండిపోయారు. కానీ నిందలు ఆయన ప్రభుత్వం మీద పడ్డాయి. కానీ సరైన సమయం చూసి ఆయన తన మార్క్ రాజకీయం చేయడం ఖాయమని అనుకోవచ్చు.
పనిలో పనిగా జర్నలిస్టుల అరెస్టుల్ని ఖండించిన వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల తీరును ఆర్కే గట్టిగానే ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిందే అసరైన అణిచివేత కానీ ఇప్పుడు కాంట్రాక్టుల కోసం..మహిళా అధికారుల వ్యక్తిత్వాన్ని హననం చేయడమే కాకుండా వారు ఆత్మహత్యాయత్నానికి కూడా కారణమైన జర్నలిస్టులను అరెస్టు చేస్తే అణిచివేత ఎలా అవుతుందని ఆర్కే సూటిగానే ప్రశ్నించారు. దీనికివారి వద్ద సమాధానం ఉండదు. మొత్తంగా చాలా వారాల తర్వాత సమగ్రమైన ఇన్ సైడ్ ఇన్ఫోతో ఆర్కే తన ఆర్టికల్‌కు మంచి వాల్యూ యాడ్ చేశారు.

