జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దేవుడ్ని కూడా నమ్మడం లేదా? . జీసస్ ను కూడా ఆయన మరచిపోయాడా?. అంటే అవునంటున్నారు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ. వారాంతపు ఆర్టికల్ కొత్తపలుకులో జగన్ రెడ్డి నోటి వెంట ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ అనే మాట వినిపించడం లేదు. తనకు గెలుపునిచ్చినప్పుడు దేవుడు..ఇప్పుడు శిక్షిస్తున్నాడు కాబట్టి దేవుడు లేడని జగన్ డిసైడయ్యారని ఆర్కే అంటున్నారు. నిజంగా దేవుడ్ని నమ్మేవారిలో పాపభీతి ఉంటుందని అలాంటిదేమీ లేకుండా జగన్ ప్రజల ఆరోగ్యాన్ని హరించి మరీ డబ్బు చేసుకున్నాడని.. డబ్బు కోసం అందర్నీ వదులుకున్నారని అంటున్నారు. ఆర్కే చెప్పిన మాటలన్నీ జరిగినవే. జగన్ ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడటం లేదు. కుటుంబమూ చీలిపోయింది.
లిక్కర్ స్కామ్లో వెలుగులోకి వస్తున్న అంశాలన్నీ ప్రజలకు ఆశ్చర్యానికి గురి చేస్తున్నవే. ఇంత అడ్డగోలుగా దోపిడీ చేసి తమకేం తెలియదని అంతా నిజాయితీగా చేశామని వాదిస్తున్నారు. వీళ్లకు దోచుకోవడం తప్ప పాపభీతి లేదని అధికారం సాధించేది కూడా దోచుకోవడానికేనని ఆర్కే విశ్లేషించారు. జరుగుతున్న పరిణామాలను చూస్తే అందులో ఎలాంటి సందేహం లేదని అందరికీ అర్థమవుతుంది. జగన్ హయాంలో ప్రముఖ కంపెనీల మద్యం ఎందుకు అమ్మలేదు.. క్యాష్ మాత్రమే ఎందుకు తీసుకున్నారు అనే డౌట్లకు సమాధానం వెదుక్కుంటే… ఎంత పెద్ద కుట్ర జరిగిందో చెప్పాల్సిన పని లేదన్నది ఆర్కే వాదన.
ఆర్కే ఓ సాక్ష్యాన్ని కూడా కథనానికి జత చేశారు. ఆ సాక్ష్యం పేరు మాగుంట శ్రీనివాసులరెడ్డి. వారి కుటుంబానికి లిక్కర్ తయారీ వ్యాపారం ఉంది. అది కూడా మెక్ డోవెల్ కంపెనీ బ్రాండ్ ను తయారు చేస్తారు. అలాంటి బ్రాండ్ ఏపీలో కనిపించకుండా పోయింది. ఆ బ్రాండ్ అమ్మాలంటే ఎంత మొత్తం కమిషన్ ఇవ్వాలో ఓ లెక్క ఆయనకు వెళ్లింది. కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని ఆయన చెప్పడంతో ఆ బ్రాండ్ అమ్మలేదు. తర్వాత ఆయనను పార్టీలో దూరం పెట్టారు. చివరికి టీడీపీలో చేరాల్సి వచ్చింది. ఆయనే జరిగిన దందాకు సాక్ష్యమన్నారు. అంతే కాదు తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ ముడుపులు ఇవ్వడానికి అంగీకరిస్తే.. రూ.రెండు వందల కోట్ల విలువైన బంగారు నాణెలను తీసుకున్నారట.
జగన్మోహన్ రెడ్డి ఏ సీఎం చేయని..చేయలేని..చేయించడానికి సాహసించని స్కామ్ చేశారని ఆర్కే చెబుతున్నారు. ఆయన ఓటమికి లిక్కర్ స్కామ్ కూడా ఓ కారణం అని.. ఆయన భవిష్యత్ కష్టాలకూ అదే కారణం కాబోతుందని నేరుగానే చెబుతున్నారు. న్యాయవ్యవస్థ పనితీరు, ఇటీవల కొంత మంది న్యాయమూర్తులు ఇస్తున్న తీర్పులపై సుప్రీంకోర్టు చేస్తున్న వ్యాఖ్యలపైనా ఆర్కే విశ్లేషించారు.