ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం న్యాయవ్యవస్థపై దండెత్తారు. సూటి ప్రశ్నలు వేశారు. రాజ్యాంగంలోని అంశాలకు విరుద్ధంగా వ్యవహరించడం దగ్గర నుంచి తాము చేయాల్సిన పనులను సరిగ్గా చేయడం లేదన్నంత వరకూ తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. సాధారణంగా ఎంతటి జర్నలిస్టు అయినా న్యాయవ్యవస్థను ఇలా ప్రశ్నించడానికి సంశయిస్తారు. కానీ ఈ విషయంలో ఆర్కే మాత్రం హద్దులు పెట్టుకోరు. ఇతర రాజకీయ నేతల్ని ప్రశ్నించినట్లే .. న్యాయవ్యవస్థనూ ప్రశ్నించారు.
స్పీకర్ను గడువులోగా నిర్ణయం తీసుకుంటారా..? జైలుకెళ్తారా? అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశ్నించడాన్ని ప్రధానంగా తప్పు పట్టారు ఆర్కే. ఎందుకంటే చట్టసభల అంశాల్లో స్పీకర్ అత్యున్నతం. ఆయన సుప్రీంకోర్టు కిందకు రారు. అదే విషయాన్ని ఆర్కే గుర్తుకు చేశారు. రాజ్యాంగంలో లేని అంశాలపై ఇలా ఆదేశాలు ఇవ్వడం.. విచారణ సమయంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమిటని ఆర్కే అభ్యంతరం. ఇది రాజ్యాంగాన్ని బలహీనపరుస్తుందని.. చట్టాలను మార్చాలని కేంద్రానికి సలహా ఇవ్వడమే మంచి పరిష్కారం అని తేల్చారు.
రాజ్యాంగంలో లేని అధికారాలతో స్పీకర్ కు గడువు పెట్టిన సుప్రీంకోర్టు.. తమకు తాము పెట్టుకున్న గడువుల పరిస్థితి ఏమిటని కూడా ప్రశ్నించారు. అవినీతి ప్రజా ప్రతినిధులపై కేసులను ఏడాదిలో పూర్తి చేయాలని గతంలోచీఫ్ జస్టిస్ ఇచ్చిన ఆదేశాలు ఎందుకు పాటించలేదని ఆయన ప్రశ్నించారు. జగన్ రెడ్డి అనే కరుడుగట్టిన నేరస్తుడు .. న్యాయవ్యవస్థను ఎందుకు లెక్క చేయడం లేదని… ఆయనను ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. ఇలా ఆర్కే.. తన ఆర్టికల్ మొత్తం న్యాయవ్యవస్థకు సూటి ప్రశ్నలు వేశారు.
సహజంగా న్యాయవ్యవస్థను సూటిగా ప్రశ్నిస్తే కంటెప్ట్ కేసు అవుతుంది. అయితే ఆర్కే సంధించిన ప్రశ్నలు ప్రజల్లో చర్చనీయాంశమవుతాయి కానీ కోర్టులు దాకా వెళ్లకపోవచ్చు. ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా..తన జర్నలిజం అనుభవసారాన్నంతా ఉపయోగించి.. ఆర్కే చాలా పద్దతిగా ప్రశ్నించారని అనుకోవాలి.
