ఆర్కె పలుకు..బాబుపైన అపార ప్రేమ, ఆంధ్రులపైన ద్వేషం

గుంపుస్వామ్యంలో పడి ప్రజలు కొట్టుకుపోతున్నప్పుడు వారిని హెచ్చరించడం మీడియా బాధ్యత’……ఇది ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణవారి తాజా మాట. ఆ బాధ్యతను తాను తీసుకున్నాను కాబట్టే తనకు రాళ్ళ దెబ్బలు తగిలాయని కూడా ఆయన రాసుకున్నారు. మరి ఆయన బాధ్యత తీసుకున్నది ఎప్పుడు అనే విషయం కూడా మాట్లాడుకోవాలిగా. సమైక్యాంధ్రప్రదేశ్ అని కానీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని కానీ చంద్రబాబు అనలేడు కాబట్టి ఇక సీమాంధ్ర ప్రజలెవ్వరూ ఆ డిమాండ్ చెయ్యకూడదు అని రాధాకృష్ణ చెప్పాడు. తెలంగాణా ఉద్యమాన్ని ప్రోత్సహించిన ఘనత తనదేనని ఆ మధ్య ఓ సారి ఇదే రాధాకృష్ణ చెప్పుకున్నాడు కాబట్టి బాబు-భక్తుడు ఒకే మాట మీద ఉన్నారు. ఆ తర్వాత నరేంద్రమోడీ భక్త సమాజంలో పడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ పడి కొట్టుకుపోతుంటే మహదానందంగా ఆ గుంపును ప్రోత్సహించాడు రాధాకృష్ణ. అలాగే ప్రత్యేక హోదా ఒక్కటే ఎపికి ప్రాణాధారం అనుకుంటున్న గుంపును ఎన్నికల సమయంలో మహబాగా ప్రోత్సహించాడు రాధాకృష్ణ. అప్పట్లో ఆ రెండు విషయాలు కూడా చంద్రబాబుకు బాగా అవసరమైనవి మరి. చంద్రబాబుని మోడీ అవమానిస్తున్నాడు అని తెలిసినవెంటనే మోడీని అభిమానిస్తూ గుంపులో పడి కొట్టుకుపోతున్న ప్రజలు అంటే రాధాకృష్ణకు విరక్తి వచ్చేసింది. ఇహ అక్కడినించి మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం మొదలెట్టాడు ఆర్కె. అలాగే ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు కాంప్రమైజ్ అయిపోయాడు కాబట్టి ఇక వేరే ఎవ్వరూ కూడా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చెయ్యకూడదు. అడగకూడదు. ప్రత్యేక హోదా పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన టిడిపి, బిజెపి, టిడిపి అనుకూల మీడియాలను ఏమీ అనకూడదు. ప్రత్యేక హోదా అడిగిన వాళ్ళందరూ గుంపుస్వామ్యంలో పడి కొట్టుకుపోతున్నారన్నది ఆర్కె ఉవాచ. 2014లో చంద్రబాబుకు, టిడిపి అనుకూల మీడియాకు కొంత విశ్వసనీయత తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు గుంపు స్వామ్యంలో పడి కొట్టుకుపోతున్నాడని ఆర్కె చెప్పారు.

ప్రత్యేక హోదాను వదిలి ప్యాకేజ్‌కి అధికార ముద్ర వేయించుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యమించాలని రాధాకృష్ణ చెప్పారు. ప్యాకేజీ ప్రకటించాంగా…ఇంకా అధికార ముద్ర ఏంది? ప్యాకేజ్‌లో ఉన్నవన్నీ ఇస్తాం…చట్టభద్రతా గట్రా ఏమీ లేవు అని బిజెపి నేతలు నొక్కుతున్న సన్నాయి నొక్కులు ఇంకా ఆర్కె చెవిన పడలేదేమో తెలియదు. రేప్పొద్దున ప్యాకేజ్ కూడా వేస్ట్. అంతకంటే బ్రహ్మాండమైనది ఇంకోటుంది అని చంద్రబాబు చెప్పడన్న గ్యారెంటీ కూడా ఏమీ లేదు. ఎందుకంటే 2014 ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా మహా గొప్పది అని చెప్పినది కూడా ఇదే చంద్రబాబు మరి. ఒక సంవత్సరంలో బాబుగోరి నోటి నుంచి ప్యాకేజ్ వేస్ట్ అన్న డైలాగ్ రాగానే మళ్ళీ ఆర్కె రెడీ అయిపోతాడు. ప్యాకేజ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాడటంలో అర్థం లేదు అని రాసేస్తాడు. ప్యాకేజ్ గురించి తెలియని వాళ్ళందరూ మాట్లాడేస్తున్నారు అని విమర్శల వర్షం కురిపిస్తాడు. ప్రత్యేక హోదా గురించి తెలియని సినిమా హీరోలు హోదా ర్యాలీకి మద్దతు పలికారు అని ఆర్కె రాశాడు. ప్రత్యేక హోదా గొప్పదనం గురించి తెలుసుకోవడం ఎంత సేపు? 2014 ఎన్నికల సమయం నాటి ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు చదివితే ప్రత్యేక హోదా ఎంత గొప్పదో? ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచంలోనే ఎంత గొప్ప స్థాయికి చేరుతుందో అనే విషయాలన్నీ కూలంకుషంగా తెలిసిపోతాయిగా. లేకపోతే ఆర్కె వారు ఈ రోజు రాసిన కొత్త పలుకును క్షుణ్ణంగా అర్థం చేసుకున్నా చాలు. ప్రత్యేక హోదాతో ఎన్ని ప్రయోజనాలుంటాయో తెలుస్తుంది. ప్రత్యేక హోదాకు ఆంధ్రప్రదేశ్‌కి అర్హత లేదు అని ఆర్కె చెప్పారు. కొండలు, అడవుల దగ్గర ఉండి పరిశ్రమలు వచ్చే ఛాన్సేలేని రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తారట. ఆ రాష్ట్రాలన్నీ కూడా ప్రత్యేక హోదా పుణ్యమా అని వచ్చే కొద్దో గొప్పో బెనిఫిట్స్‌తోనే మనుగడ సాగిస్తున్నాయి. తెలుగుదేశం నేతల్లాంటివాళ్ళు వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. మరి అదే ప్రత్యేక హోదా అన్ని వనరులూ ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి వస్తే….? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మామూలుగా ఉండదు. అందుకే మన ఎపి చుట్టుపక్కల రాష్ట్రాలేవీ ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఒప్పుకోవు. అలాగే ప్రత్యేక హోదా ఇస్తే మిగతా చాలా రాష్ట్రాల్లో బిజెపికి నష్టం జరుగుతుంది అని కూడా ఆర్కె రాశాడు. ఆ మాటలు చాలు…ప్రత్యేక హోదా ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవడానికి.

ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఆర్కెకు ఉన్న చులకన భావం కూడా అర్థమవుతూనే ఉంది. కులాల కుంపట్లో కొట్టుకుచస్తున్నారు అనే స్థాయిలో రాశాడు. మరి కులాల కుంపట్లు, మతాల గొడవలు లేని రాష్ట్రం ఏదో ఆర్కెనే చెప్పాలి. ఆ కులాల గొడవలను రెచ్చగొట్టిన మహానుభావులు ఎవరో కూడా ఆర్కె ఆత్మపరిశీలన చేసుకోవాలి. అలాగే ఆంధ్రా నాయకులు మద్రాస్‌ని అడిగారు, సమైక్యాంధ్రప్రదేశ్‌ని అడిగారు, హైదరాబాద్‌ని అడిగారు అని కూడా అత్యంత చులకనగా మాట్లాడేశాడు ఆర్కె. మరి ఆయా రాష్ట్రాల వాళ్ళు తిరుపతిలో వాటా కావాలి అని అడిగిన విషయం ఆర్కెకి తెలియదా? భద్రాచలాన్ని దోచుకెళ్ళిపోయిన విషయం ఆర్కెకి తెలియదా? స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆంధ్రులు నష్టపోయినంతగా నష్టపోయిన ప్రజలు ఎవరైనా ఉన్నారా? అప్పుడు మద్రాస్ అయినా, ఇప్పుడు హైదరాబాద్ విషయంలో అయినా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే.

అలా నష్టపోవడానికి కారణం కూడా ఆంధ్రప్రదేశ్ నాయకుల బానిస బుద్ధి, వాళ్ళ అనుకూల మీడియా వాళ్ళ భజన పర్వం. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు బేషరతుగా సపోర్ట్ చేసిన బిజెపి ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు హీరో అయింది? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మోడీని దేవుడిగా చూపించింది ఎవరు? మరోసారి మోసపోయాం అని రియలైజ్ అయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాంతియుతంగా నిరసన తెలుపుతామన్నా…వాళ్ళు నోర్లు నొక్కేస్తున్నది ఎవరు? ఆర్కె చెప్పినట్టుగా 2019 వరకూ ఎపి ప్రజలందరూ సైలెంట్‌గా ఉంటారు. మరి పోలవరం పూర్తవుతుంది, రైల్వే జోన్ వస్తుంది, ప్యాకేజ్‌లో ప్రకటించినవి అన్నీ వస్తాయి, హోదాతో సమానమైన ప్రయోజనాలు వస్తాయి అని బాబు హామీ ఇవ్వగలడా? అలా చెయ్యలేకపోతే నేను 2019 ఎన్నికల్ల పోటీ చేయను అని ప్రకటించగలడా? 2019 ఎన్నికల నాటికి అవసరమైతే మోడీతో తెగతెంపులు చేసుకోవడానికి, మోడీకి వ్యతిరేకంగా బరిలోకి దిగడానికి చంద్రబాబు ప్లాన్స్ చేసుకుంటున్న మాట వాస్తవం కాదా? అప్పుడు ఇదే బాబు….ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్యాకేజ్‌లో ప్రకటించినవీ ఇవ్వలేదు, ఆంధ్రప్రదేశ్‌కి మోడీ అన్యాయం చేశాడు….అందుకే మోడీని ఓడించండి, నన్ను మాత్రం గెలిపించండి అని అడగడన్న గ్యారెంటీ ఉందా? అప్పుడు కూడా గుంపుస్వామ్యంలో పడి కొట్టుకుపోకుండా బాబను గెలిపించండి, మోడీని ఓడించండి అని ఆర్కె చెప్పకుండా ఉంటాడా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com