ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం పూర్తిగా బాలకృష్ణకు క్లాస్ తీసుకోవడానికి తన సమయం కేటాయించారు. కొత్త పలుకులో బాలకృష్ణకు చాలా విషయాలపై అవగాహన కల్పించే విధంగా కథనం రాశారు. ఆయనకు చెప్పడానికి అటు చంద్రబాబు నుంచి స్పీకర్ వరకూ అందరూ భయపడిపోతున్నారని గుర్తించి.. తానే స్వయంగా రంగంలోకి దిగారు. అలా ఇలా కాదు.. సభా మర్యాదల దగ్గర నుంచి గతంలో జరిగిన కాల్పుల ఘటన వరకూ అన్నింటినీ గుర్తు చేశారు. బాలకృష్ణ విషయంలో కూటమి ప్రభుత్వానికి ఎదురవుతున్న సమస్యలను కూడా టచ్ చేసి.. బాలకృష్ణ తెలుసుకోవాల్సింది చాలా ఉందని నేరుగానే చెప్పారు.
అసెంబ్లీలో బాలకృష్ణ జగన్ రెడ్డిని సైకోగాడు అన్నారు. కానీ చిరంజీవిని అవమానించినట్లుగా వైసీపీ ప్రేరేపిత రాజకీయం జరిగింది. ఈ ట్రాప్లో కూటమి పడలేదు. కానీ ఇలాంటి అవకాశం ఎందుకు వైసీపీకి బాలకృష్ణ కల్పించారన్నది ఆర్కే ప్రధాన విమర్శ. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సభా మర్యాదల గురించి తెలియదా అని సూటిగానే అడిగారు. అదే సమయంలో ఒంటరిగా పోటీ చేసి ఎవరూ గెలవలేరని ఎవరికైనా పార్టీ సపోర్టు ఉండాలని కూడా చెప్పుకొచ్చారు. ఆర్కే కూటమికి ఏర్పడిన సమస్యను చాలా సీరియస్ గా తీసుకున్నారు.
కులాల రాజకీయాలు ఎలా జరుగుతున్నాయో.. కానీ ప్రజలు మాత్రం ఓట్లు వేసేటప్పుడు కులాలు చూడటం లేదని గుర్తు చేశారు . ఆయా పార్టీలను కులాలు ఓన్ చేసుకున్నా.. వారి ఓట్లతోనే గెలవలేరు అన్న విషయాన్ని మర్చిపోవద్దని సలహాలిస్తున్నారు. ఇప్పుడు కులాల్లో కూడా పెళ్లిళ్లకు పట్టింపులు ఉండటం లేదని గుర్తు చేస్తున్నారు. రెడ్లు, కమ్మలు, కాపుల పెళ్లిళ్లలో ఇప్పుడు కుల పట్టింపు తగ్గిపోయిందని గుర్తు చేశారు. ఈ ఆర్టికల్ రాసేసిన తర్వాత అంబటి రాంబాబు తన కుమార్తె పెళ్లిని కమ్మ సామాజికవర్గ అబ్బాయితో అమెరికాలో నిర్వహించారు. లేకపోతే ఆర్కే ప్రత్యేకంగా ప్రస్తావించేవారేమో ?.
బాలకృష్ణకు ఎవరూ చెప్పలేకపోతున్నారన్నది నిజం. ఆయన తెలుసుకోవాల్సి ఉంది. కానీ తెలుసుకోలేకపోయారు. మాటల మీద అదుపు ఉండదని.. రాజకీయాల్లో అది ఉంటే సమస్యలు వస్తాయని ఆర్కే నేరుగానే తన తన ఆర్టికల్ ద్వారా చెప్పారు. ఎవరూ చేయలేని పనిని చేశారు. ఆయన వల్ల పార్టీకి, చంద్రబాబుకు వస్తున్న ఇబ్బందుల్ని కూడా వివరించారు. బాలకృష్ణ ఇక అలాంటి సమస్యలు తీసుకు రాకపోతే ఆ క్రెడిట్ ఆర్కేకే దక్కుతుంది.