తెలంగాణలో 2023లో జరిగిన ఫార్ములా ఈ-కారు రేస్‌లో భారీ అవినీతి జరిగినట్లు యాంటీ-కరప్షన్ బ్యూరో దర్యాప్తులో తేలింది. ఈ కేసులో కేటీఆర్ , మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, మాజీ హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. రూ. 54.88 కోట్ల నిధుల దుర్వినియోగం, ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా క్విడ్ ప్రో క్వో లావాదేవీలు జరిగినట్లు తేల్చింది. గవర్నర్ అనుమతి తర్వాత చార్జిషీటు దాఖలు చేయనున్నారు.
ఏసీబీ దర్యాప్తు ప్రకారం, గ్రీన్కో గ్రూప్‌కు చెందిన సంస్థలు 2022 ఏప్రిల్ 8 నుంచి అక్టోబర్ 10 వరకు బీఆర్ఎస్కు రూ. 41 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చాయి. ఈ బాండ్స్ ఫార్ములా ఈ-రేస్ స్పాన్సర్షిప్కు బదులుగా ఇచ్చారు. ఇది క్విడ్ ప్రో క్వో లావాదేవీగా ఉందని ఏసీబీ నిర్ధారించింది. ఏసీబీ కేటీఆర్‌ను A1 నిర్దారించింది. హెచ్ఎండీఏ నుంచి ఎఫ్ఈఓకు రూ. 54.88 కోట్లు చట్టవిరుద్ధంగా బదిలీ చేయడం, ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా లావాదేవీలు జరపడం, రాష్ట్ర కేబినెట్ ఆమోదం లేకుండా ఒప్పందం కుదుర్చడం వంటివి నేరాలుగా ఏసీబీ తేల్చింది.
హెచ్ఎండీఏ నుంచి ఎఫ్ఈఓకు రూ. 44 కోట్లు చెల్లించడం, దీనికి బదులుగా గ్రీన్కో గ్రూప్ నుంచి బీఆర్ఎస్కు రూ. 41 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో లబ్ధి చేకూరడంతో క్విడ్ ప్రో కో స్పష్టమయింది. ప్రజా ధనాన్ని ఇలా అక్రమంగా కొల్లగొట్టారని ఏసీబీ తేల్చింది. నివేదికను ప్రభుత్వానికి ఏసీబీ సమర్పించింది. గవర్నర్ ఆమోదం అవసరం ఉన్నందున.. ఆమోదం లభించిన తర్వాత చార్జిషీటు దాఖలు చేయనున్నారు. ఈ కేసులో ఇక కేటీఆర్ అనే ప్రశ్న ఉత్పన్నం కాకపోవచ్చని అంచనా వేస్తున్నారు.