ఏపీలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఒక్క సారిగా రిజిస్ట్రేషన్ ఆఫీసులపై ఎటాక్ చేశారు. ఏకంగా 120 ఆఫీసుల్లో సోదాలు చేశారు. చాలా చోట్ల ఇంకా కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫీసులు అంటేనే అవినీతికి కేరాఫ్. ఎన్ని సంస్కరణలు తెచ్చినా.. వారి అవినీతి అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గడం లేదు. ఈ ఫిర్యాదులు పెరిగిపోవడంతో వాటి సంగతి తేల్చాలని.. సంస్కరణలు తేవాలని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది.
సామాన్యులకు లంచాల పోటు – అంతకు మించి అక్రమాలు
సామాన్యుడు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లి ఓ ఆస్తి లేదా మరో అంశంపై రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే.. ప్రభుత్వానికి కట్టినంత ఫీజు లంచంగా చెల్లించాలి. అది నేరుగా కాదు. బ్రోకర్ ఉంటాడు. అసలు రిజిస్ట్రేషన్ ఆఫీసు అంతా డాక్యుమెంట్ రైటర్ల పేరుతో ఉండే బ్రోకర్ల రాజ్యమే. ఈ అవినీతిని ఎవరూ ఆపలేకపోతున్నారు. ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. అయితే ఈ లంచాలకు తోడు.. భూఅక్రమాలు ఇప్పుడు పెను సమస్యగా మారాయి.
ఇష్టం వచ్చినట్లుగా రికార్డుల మార్పు
రిజిస్ట్రేషన్ కార్యాలయాలే భూ వివాదాలకు అడ్డాగా మారుతున్నాయి. డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఓ సర్వే నెంబర్ బదులు మరో సర్వే నెంబర్ తో గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రభుత్వ భూములు దిగమింగడానికి ఇతరులతో కలిసి కుట్రలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు అంతకంతకూ పెరిగిపోతూండటంతో ప్రభుత్వం ఏసీబీకి భారీ ఆపరేషన్ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది.
పూర్తిగా ఆపలేరు కానీ.., కంట్రోల్ చేయవచ్చు !
రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిని పూర్తిగా తొలగించాలంటే చాలా సమయం పడుతుంది. ఎన్నోసంస్కరణలు తీసుకు రావాలి. కానీ ఇప్పటికిప్పుడు అవినీతి తగ్గించి ప్రజల్ని పీడించకుండా.. భూవివాదాలు రాకుండా చేయడానికి అవకాశం ఉంది. అదే భయం కల్పించడం. ఆ భయం కల్పించి.. పనులు కాస్త జాగ్రత్తగా అయ్యేలా చూడాలి. ఏసీబీ దాడులతో అలాంటి భయం ఏర్పడితే అంత కంటే సామాన్యులకు కావాల్సింది ఏముంది?