తొలుగుతున్న ముసుగులు: నట”ప్రకాశ” శివాజీ కి టీవీ9 లో 9% వాటా?

నెమ్మది నెమ్మదిగా ముసుగులు తొలగి పోతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలకు, కొంత మంది వ్యక్తులకు సంబంధించిన కీలక పరిణామాలు కూడా టీవీ9 లో వార్తకు నోచుకోక పోయినప్పటికీ, నటుడు శివాజీ కి మాత్రం తుమ్మినా దగ్గినా టీవీ9 లో స్క్రోలింగ్, ఆయన వ్యాఖ్యల మీద అంత డిస్కషన్, డిబేట్ లు ఎందుకు పెడుతున్నారా అని బుర్రలు బద్దలు కొట్టుకున్న జనాల సందేహాలకు సమాధానం దొరికింది. శివాజీ కి టీవీ 9 లో అధికారికంగా 9 శాతం వాటా ఉన్నట్లు నిర్ధారణ అయింది.

టీవీ9 అమ్మకం మీద నేషనల్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించిన శివాజీ:

ఒక ఆంగ్ల పత్రిక రాసిన కథనం ప్రకారం, నటుడు శివాజీ, టీవీ9 మాతృ సంస్థ అయిన ఏబిసిఎల్ కంపెనీ లో 9% వాటా కలిగి ఉన్నాడు, ఆ వాటా కూడా ఆయన టీవీ9 సీఈఓ అయిన రవి ప్రకాష్ వద్దనుండి కొనుక్కున్నాడు. ఇటీవలే శివాజీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆశ్రయించాడు. టీవీ9 లో ని 80 శాతం వాటా ని మై హోమ్ సంస్థ అధినేత రామేశ్వర రావు, మేఘ ఇంజనీరింగ్ సంస్థ అధినేత కృష్ణారెడ్డి సుమారు 460 కోట్ల పెట్టుబడి తో కొనుక్కోవడాన్ని ఈయన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో సవాలు చేస్తున్నారు. శివాజీ కేసును విచారించడానికి ట్రిబ్యునల్ కూడా అంగీకరించింది.

రవి ప్రకాష్ ప్రోద్బలంతోనే శివాజీ ట్రిబ్యునల్ని ఆశ్రయించాడా?

అయితే, టీవీ9 అమ్మకం ప్రక్రియ గురించి తొమ్మిది నెలల కిందటే విశ్లేషిస్తూ, ఈ అమ్మకం ప్రక్రియ ఎడిటోరియల్ బోర్డులో సైతం మార్పులు తీసుకు వస్తుందని ఊహిస్తూ ఆర్టికల్ రాయడం జరిగింది:

click here:
https://www.telugu360.com/te/controversy-went-to-such-an-extent-srini-raju-looking-for-exit-tv9/

ఈ అమ్మకం ప్రక్రియ కేవలం యాజమాన్యం వరకు మాత్రమే ప్రభావం చూపుతుందని ఎడిటోరియల్ బోర్డు విషయంలో ఎటువంటి ప్రభావం చూపదని అప్పట్లో టీవీ9 అధికారిక ప్రకటన ఇచ్చినప్పటికీ, అన్నేసి వందల కోట్లు పెట్టుబడులు పెట్టిన తర్వాత యాజమాన్యం ఎడిటోరియల్ బోర్డు లో ఎటువంటి జోక్యం చేసుకోదని భావించలేమని విశ్లేషించడం జరిగింది. ఇప్పుడు ఆ విశ్లేషణ నిజమయ్యేలా కనిపిస్తోంది. టీవీ9 ఛానల్ నుండి రవి ప్రకాష్ ను తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు గా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

click here:
https://www.telugu360.com/ravi-prakash-and-team-to-be-forced-out-of-tv9/

అయితే ఇప్పుడు నటుడు శివాజీ ట్రిబ్యునల్ ని ఆశ్రయించడానికి, రవి ప్రకాష్ ని ఛానల్ నుంచి తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహగానాలకి సంబంధం ఏమైనా ఉందా అన్న చర్చ మీడియా వర్గాల్లో నడుస్తోంది.

శివాజీకి నట “ప్రకాశ” బిరుదు ఇవ్వాలేమో?

నట సార్వభౌమ ఎన్టీఆర్ మనకు తెలుసు, నటశేఖర కృష్ణ మనకు తెలుసు. వీరు వెండితెర మీద అద్భుతంగా నటించారు. కానీ బుల్లి తెర మీద నటుడు శివాజీ అభినయం చూస్తే ఈయన కూడా అంతకు మించిన ఏదైనా బిరుదిస్తే బాగుంటుందేమో అని అనిపించక మానదు. ఎందుకంటే, శివాజీ ప్రతి స్టేట్మెంట్ కి టీవీ9 లో విపరీతమైన ప్రాధాన్యత లభించడం గురించి మంది విశ్లేషకులు శివాజీని ఇంటర్వ్యూలలో అడిగారు కూడా. దానికి సమాధానం ఇస్తూ శివాజీ, తనకు టీవీ9 తో ఎటువంటి సంబంధాలు లేవని, కేవలం సామాజిక కోణంలో తాను లేవనెత్తిన అంశాలను టీవీ9 స్వచ్ఛందంగా హైలెట్ చేస్తోంది అన్నట్లుగా చెప్పుకొచ్చారు. టీవీ9 లో తన వాటా ఉన్న విషయం ఆయన వెల్లడించలేదు. అయితే కేవలం శివాజీ వ్యాఖ్యలని టీవీ9 ఎందుకు ఇంతలా హైలెట్ చేస్తుంది అన్న ప్రశ్న మాత్రం జనాల బుర్రలో అలా మిగిలిపోయింది. ప్రత్యేకించి ఆపరేషన్ గరుడ అంటూ ఆయన చేసిన హడావుడి మీద సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు వచ్చినా టీవీ9 ఆ “గరుడ” పురాణాన్ని పదే పదే ప్రాధాన్యంగా ప్రసారం చేయడం తెలిసిందే. ఇప్పుడు శివాజీకి 9 శాతం వాటా టీవీ 9 లో ఉన్నట్లు తెలియడం, అది కూడా సీఈఓ రవిప్రకాష్ నుంచే కొన్నాడని తెలియడం చూస్తే, టీవీ9 తో తనకు ఎటువంటి సంబంధాలు లేవని నటించిన శివాజీ కి నట “ప్రకాశ” లాంటి బిరుదులు ఏదైనా ఇచ్చిన సమంజసమేనని జనాలు అభిప్రాయపడుతున్నారు.

ఏమైనా టీవీ9 విషయంలో రాబోయే కొద్ది వారాలలో మరిన్ని మలుపులు ఉండే అవకాశం కనిపిస్తోంది.

– జురాన్ (@CriticZuran)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com