భారతి సిమెంట్ కార్పొరేషన్ . రామ్ కో సిమెంట్స్ సంస్థలకు సున్నపురాయి మైనింగ్ లీజుల స్కాంలో తమ వాదనలు వినిపించేందుకు మరోసారి ప్రభుత్వం అవకాశం కల్పించింది. జగన్ సీఎంగా ఓడిపోయే ముందు భారతి సిమెంట్స్ , రామ్ కో సిమెంట్స్ సంస్థలకు అక్రమంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి లీజులు కేటాయింప చేసుకున్నారు. కేంద్ర గనుల శాఖ నిబంధనల ప్రకారం, సహజ వనరుల కేటాయింపులు కచ్చితంగా E-వేలం ద్వారానే జరగాలి. అయితే, ఈ సంస్థలు పాత దరఖాస్తులను ప్రాతిపదికగా చూపిస్తూ లీజులు రాసేసుకున్నారు.
పారదర్శకమైన వేలం ప్రక్రియను అనుసరించకుండా లీజులు దక్కించుకోవడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తూ, దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. గతంలో విచారణ పూర్తి అయింది. లీజులు ఎందుకు రద్దు చేయకూడదో నోటీసులు జారీ చేశారు. అయితే అన్నీకరెక్ట్ గా చేశామని భారతి సిమెంట్స్ వాదిస్తోంది. దీంతో నేరుగా హాజరై వాదనలు వినపించాలని ప్రభుత్వం ఆదేశించింది. కంపెనీ ప్రతినిధులు వ్యక్తిగతంగా హాజరై తమ వాదనను వినిపించే అవకాశం ఉంది.
2015 మైనింగ్ చట్ట సవరణల కంటే ముందే తమ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, ఆ ప్రాతిపదికనే లీజులు దక్కాయని కంపెనీలు వాదించే అవకాశం కనిపిస్తోంది. నిజానికి అంతకు ముందు అసలు భారతి సిమెంట్స్ లేదు. రఘురాంసిమెంట్స్ ఉండేది. దాన్ని జగన్ కొనుగోలు చేశారు. మైనింగ్ రంగంలో పారదర్శకత పెంచేందుకు కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలను పక్కన పెట్టడం చెల్లదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో కంపెనీలు ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే లీజులు రద్దు చేసే అవకాశం ఉంది.
నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, లీజుల రద్దు విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం వెంటనే లీజులను రద్దు చేయకుండా, నోటీసులు ఇవ్వడం, వ్యక్తిగత హాజరుకు అవకాశం కల్పించడం వంటి చర్యలతో ప్రక్రియను సాగదీస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భారతి సిమెంట్స్ వంటి సంస్థలకు సంబంధించిన వ్యవహారం కావడంతో, రాజకీయ సమీకరణాలు కూడా ఈ లీజుల రద్దు ప్రక్రియపై ప్రభావం చూపుతున్నాయా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
