మచిలీపట్నం భూసేకరణకి నోటిఫికేషన్ విడుదల..మళ్ళీ అవే సమస్యలు

మచిలీపట్నం ఓడరేవు నిర్మాణం కోసం భూసేకరణకై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. స్థానిక ప్రజలు, రైతులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నా ప్రభుత్వం 33, 337.67 ఎకరాలు సేకరించడానికి సిద్దపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. దానిలో 9, 778. 20 ఎకరాలు ప్రభుత్వ భూములే ఉన్నాయి కనుక మిగిలిన 23, 559.47 ఎకరాలని రైతుల దగ్గర నుంచి సేకరించవలసి ఉంటుంది. కానీ అన్ని వేల ఎకరాలని సేకరించడం చాలా కష్టమైనా పనే. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం భూసేకరణకి పూనుకొన్నప్పుడే రైతులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. మళ్ళీ ఇప్పుడు మరోమారు ఆ సమస్యలన్నిటినీ ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు ప్రభుత్వం సేకరించబోయే భూమిలో 5,054.03 ఎకరాలు మచిలీపట్నం ఓడరేవు కోసం, 28,283.64 ఎకరాలు పారిశ్రామికవాడ కోసం కేటాయించింది.
ఇక్కడ కూడా రాజధాని ప్రాంతంలోలాగే ల్యాండ్ పూలింగ్ విధానం అమలు చేయబోతోంది. రైతులు, రైతు కూలీలకి ఇవ్వబోయే నష్టపరిహారం, ప్యాకేజి వివరాలు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లో వివరంగా పేర్కొంది.

తెదేపా ప్రభుత్వం రాజధాని, పరిశ్రమలు, ఓడరేవులు, విమానాశ్రయాలు మొదలైన అవసరాల కోసం సుమారు లక్ష ఎకరాల పైనే భూసేకరణకి పూనుకొంటోంది. అన్ని చోట్ల రైతులు స్వచ్చందంగా తమ భూములని ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారని తెదేపా నేతలు, మంత్రులు చెప్పుకొంటున్నప్పటికీ అది వాస్తవం కాదని అందరికీ తెలుసు. ప్రభుత్వం నయాన్నో, భయన్నో భూసేకరణ చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రస్తుతానికి వాటి విమర్శలని ఆరోపణలని ప్రభుత్వం పట్టించుకోకపోయినా పరువాలేదు. అలాగే రైతులు వ్యతిరేకిస్తున్నా భూసేకరణ చేస్తున్న ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి అడిగేవారు లేరు కనుక ప్రభుత్వం తనకి నచ్చినట్లు ముందుకు సాగవచ్చు. కానీ ఈ చర్యలన్నీ చంద్రబాబు నాయుడు రైతు-వ్యతిరేకి అనే అభిప్రాయాన్ని మరింత బలపరుస్తాయని మరిచిపోకూడదు.

ఇదివరకు సరిగ్గా ఇదే కారణంతో తెదేపా అధికారం కోల్పోయింది. పంట రుణాల మాఫీ విషయంలో మాట తప్పినందుకే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న రైతులని ఈ భూసేకరణతో ఇంకా దూరం చేసుకొంటున్నట్లే కనిపిస్తోంది. మరి దాని పర్యవసానాలు ఏవిధంగా ఉంటాయో తెదేపాకి తెలియదనుకోలేము. కనుక తెదేపా బాగా ఆలోచించుకొనిముందుకు సాగడం మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com