వైకాపాకి పొంచి ఉన్న వ‌ల‌స ముప్పు!

నంద్యాల ఉప ఎన్నిక ఓట‌మి ప్ర‌భావం ప్ర‌తిప‌క్ష పార్టీ వైకాపాపై బాగానే ప‌డింద‌ని చెప్పొచ్చు. 2019 మ‌హా కురుక్షేత్రానికి ఇదే సెమీ ఫైన‌ల్ అంటూ ఒక సాధార‌ణ ఉప ఎన్నిక‌కి ప్రాధాన్య‌త పెంచింది కూడా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన‌డంలో సందేహం లేదు. అయితే, చివ‌రికి అనూహ్య మెజారిటీతో తెలుగుదేశం గెలుపొందింది. విచ్చ‌ల‌విడిగా సొమ్ము ఖ‌ర్చు, బెదిరింపులు వ‌ల్ల‌నే టీడీపీకి నంద్యాల ప్ర‌జ‌లు ఓట్లేశార‌ని వైకాపా నేత‌లు ఇప్ప‌టికీ విమ‌ర్శిస్తున్నారు. ఏదేమైనా, నంద్యాల ఓట‌మి ప్ర‌భావం రాష్ట్రవ్యాప్త వైకాపా కేడ‌ర్ పై ఎంతో కొంత ఉంద‌నేది వాస్త‌వం. అందుకే, శ్రేణుల్లో నిరుత్సాహం నిండ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతోనే వైయ‌స్సార్ ఫ్యామిలీ కార్య‌క్ర‌మాన్ని జ‌గ‌న్ ప్రారంభించారు. వైయ‌స్ అభిమానులు, ఆయ‌న హయాంలో ల‌బ్ధిపొందిన కుటుంబాల‌ను గుర్తించి, వైయ‌స్సార్ ఫ్యామిలీలో చేర్చాల‌నే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా వైకాపాకి సాలిడ్ గా ఒక ఓటు బ్యాంకును త‌యారు చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యం అనేది తెలుస్తూనే ఉంది. దీంతోపాటు, కింది కార్య‌క‌ర్త‌ల‌ను ఏదో ఒక ప‌నిలో నిమ‌గ్న‌మైయ్యేట్టుగా ఉంచ‌డం కూడా మ‌రో ఉద్దేశం అని చెప్పొచ్చు. క్షేత్ర‌స్థాయిలో ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డం అనేది స‌రైన వ్యూహ‌మే. అయితే, నాయ‌కుల స్థాయిలో జ‌గ‌న్ ఇస్తున్న భ‌రోసా ఏంట‌నేదే ఇక్క‌డ అస‌లు ప్ర‌శ్న‌..?

నంద్యాల‌లో తెలుగుదేశం పార్టీ గెలిచిన ద‌గ్గ‌ర నుంచీ మ‌రోసారి భారీ వ‌ల‌స‌లు ఉండేందుకు ఆస్కారం ఉంద‌నే ప్ర‌చారం ఊపందుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వైకాపాకి చెందిన కొంత‌మంది నాయ‌కులు త‌మ‌కు ట‌చ్ లోకి వ‌స్తున్నార‌నీ, టీడీపీలోకి వ‌చ్చేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేస్తున్నార‌నీ, దీనిపై పార్టీలో ఒక నిర్ణ‌యం జ‌రిగిన త‌ర‌వాత వ‌చ్చేవారిని చేర్చుకుంటామ‌ని కొంత‌మంది టీడీపీ నేత‌లు బ‌హిరంగంగానే చెబుతున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వ‌ల‌స‌ల‌కు ఆస్కారం క‌చ్చితంగా ఉంది. మ‌రి, ఇలాంటప్పుడు పార్టీ నేత‌ల‌కు జ‌గ‌న్ క‌ల్పిస్తున్న భ‌రోసా ఏంట‌నేదే ప్ర‌శ్న‌..? న‌ంద్యాల ఓట‌మి అనంత‌రం ఆయ‌న వైయ‌స్సార్ ఫ్యామిలీ కార్య‌క్ర‌మం అంటూ ప్ర‌జ‌ల్లోకి వెళ్లిపోయారు. వ‌చ్చే నెల నుంచీ పాద‌యాత్ర అంటున్నారు. అంటే, దాదాపు కొన్ని నెల‌ల‌పాటు ఆయ‌న జ‌నంలో ఉండేందుకే నిర్ణ‌యించుకున్నారు.

ప్ర‌జ‌ల్లో ఉండ‌టం మంచిదే. కానీ, ఈలోగా వ‌ల‌స‌ల‌పై కాస్తైనా జాగ్ర‌త్తప‌డాలి క‌దా అనేదే కొంత‌మంది వైకాపా నేత‌ల ఆవేద‌నగా తెలుస్తోంది. అయితే, శ్రీకాంత్ రెడ్డిలాంటి కొంత‌మంది వైకాపా నేత‌లు మాత్రం ఉల్టా మాట్లాడుతున్నారు. త‌మ‌తో టీడీపీ నేత‌లే ట‌చ్ లో ఉన్నార‌నీ, వ‌చ్చే వాళ్ల‌ను రాజీనామా చేయ‌మ‌ని జ‌గ‌న్ చెబుతున్నార‌నీ, కొన్నాళ్ల‌పాటే ప‌ద‌వి ఉంటుంది కాబ‌ట్టి, కొంత స‌మ‌యం తీసుకుని వైకాపాలోకి వ‌చ్చి చేర‌తామ‌ని ఆ నేత‌లు చెప్తున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి మీడియాతో చెప్పారు. ఈ వ్యూహం కూడా స‌రైంది కాదు! ఎందుకుంటే, ఇప్పుడు టీడీపీ నుంచి వైకాపాలోకి నాయ‌కులు వ‌చ్చే ప‌రిస్థితి లేద‌నేది సామాన్యుల‌కు కూడా అర్థ‌మ‌య్యే విష‌యం. ఇలా మాట్లాడ‌టం వ‌ల్ల వైకాపా నేత‌లు ఎక్క‌డికీ వెళ్ల‌కుండా ఉంటార‌నేదే వారి ఆలోచ‌న అయితే… మ‌రోసారి ఇబ్బందుల్లో ప‌డే అవ‌కాశం ఉంటుంది. మొత్తానికి, నంద్యాల ఓట‌మి త‌రువాత వైకాపా నేత‌ల‌కు జ‌గ‌న్ నుంచి స‌రైన ఓదార్పు అంద‌లేద‌నే వాద‌న ఒక‌టి వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.