ఎన్నో అడ్డంకుల్ని, ఆటుపోట్లని తట్టుకొని అఖండ 2 విడుదలకు సిద్ధమైంది. 12న ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. 11 రాత్రి నుంచి ప్రీమియర్ల హడావుడి మొదలైపోతోంది. నైజాంలో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. ఈ బజ్‌ని మరింత పెంచేలా… అఖండ నుంచి కొత్త టీజర్ వచ్చింది. ఈసారి ఇంకాస్త క్రేజీ స్టఫ్ తో. ఇప్పటికే ఓ టీజర్, రెండు ట్రైలర్లు విడుదల చేసింది చిత్రబృందం. ఇది రెండో టీజర్ అన్నమాట. రిలీజ్‌కు ఇంకొన్ని గంటల్లో బయటకు వచ్చిన ఈ కొత్త టీజర్ అఖండ బజ్‌ని మరింత పెంచేలా వుంది.
బోయపాటి సినిమాలు హై ఓల్టేజ్ యాక్షన్ ని పరిచయం చేసేలా వుంటాయి. ఈ కొత్త టీజర్‌లోని ప్రతీ ఫ్రేములోనూ అదే కనిపించింది. ముఖ్యంగా అఘోరా అవతారంలో బాలయ్య దిష్టి తీసే షాట్ అయితే మాత్రం…. థియేటర్లో పూనకాలు తెప్పించేలా వుంది. అఖండ 2పై ఉన్న దిష్టంతా తీసినట్టు ఈ సీన్ సింబాలిక్ గా అనుకోవొచ్చు. అఘోరా పాత్ర పైనే ఈ టీజర్ ఫోకస్ చేసింది. నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్… జెట్ స్పీడులో సాగిపోయింది. విజువల్స్, కుంభమేళా షాట్స్, మంచు కొండల్లో తీసిన యాక్షన్ ఘట్టాలకు ఈ టీజర్లో పెద్ద పీట వేశారు. తమన్ సంగీతం ఎప్పటిలానే.. యాక్షన్ డోసు పెంచడానికి ఉపయోగపడింది. మొత్తానికి ఈ కొత్త టీజర్ తో అఖండ 2 హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది.