అఖిల్ అరంగేట్ర సమయంలో చాలా పెద్ద పెద్ద అంచనాలే ఉండేవి. అందగాడు.. లుక్స్ బాగుంటాయి.. డాన్సులు బాగా చేయగలడు. అక్కినేని కుటుంబం అండ దండలు ఉన్నాయి. ఎలా చూసినా ప్లస్సే. పైగా వినాయక్ చేతుల మీదుగా అరంగేట్రం. ఆ సినిమాకు నితిన్ నిర్మాత. ఓ డెబ్యూ హీరోకి ఏం దక్కాలో అంతకంటే ఎక్కువ దక్కాయి. నాగచైతన్యతో పోలిస్తే అఖిల్ కెరీర్ బాగుంటుందని అంతా ఆశించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ‘అఖిల్’ సినిమా నుంచి… ఇప్పటి వరకూ అలుపెరుగుగని పోరాటమే చేస్తున్నాడు. అక్కినేని అభిమానులకు ఉన్న ఏకైనా నిరాశ, అసంతృప్తి.. అఖిల్ కి హిట్టు పడకపోవడమే.
తొలి సినిమాలోనే ప్రపంచాన్ని కాపాడేసే సూపర్ హీరోగా అఖిల్ ని ట్రీట్ చేయడం ఎవరికీ నచ్చలేదు. ‘ఫస్ట్ సినిమాకే ఇంత భారం ఎందుకు’ అనేశారు. విక్రమ్ కె.కుమార్ తో చేసిన ‘హలో’ కూడా మంచి అంచనాలతోనే విడుదలైంది. అప్పటికి విక్రమ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ‘మనం’లాంటి సినిమా తీసిచ్చాడు. తన టాలెంట్ పై అందరికీ నమ్మకం. కానీ సిల్లీగా ‘ఫోన్’ కాన్సెప్ట్ పట్టుకొని దొరికిపోయాడు. మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాజిలర్ రెండూ బెటర్ సినిమాలే. కానీ ‘అఖిల్ హిట్టు కొట్టాడు’ అని తృప్తి పడలేకపోయారు అభిమానులు. ‘ఏజెంట్’ అయితే మరీ డిజాస్టర్. ఆ సినిమా గురించి విడుదలకు ముందు చాలా గొప్పగా భావించారు ఫ్యాన్స్. సురేందర్ రెడ్డి టేకింగ్ అదరగొడతాడని, అఖిల్ కి మాస్ ఇమేజ్ దక్కడం ఖాయం అనుకొన్నారు. కానీ ఫస్ట్ షో డే.. డిజాస్టర్ టాక్ మూటగట్టుకొంది. ఆ ఎఫెక్ట్ నుంచి దర్శక నిర్మాతలు ఇప్పటి వరకూ కోలుకోలేకపోయారు.
2023లో ‘ఏజెంట్’ రిలీజ్ అయ్యింది. ఇప్పటి వరకూ మరో సినిమా లేదు. ఇప్పుడు అందరి దృష్టీ `లెనిన్`పై ఉంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని భావిస్తున్నాడు అఖిల్. నిర్మాత నాగవంశీ కూడా అదే పనిలో ఉన్నారు. మే 31న ఈ సినిమాని రిలీజ్ చేయాలి. కానీ జూన్ 26కి వెళ్లిపోయింది. ఈరోజు అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా కనీసం టీజర్ అయినా రిలీజ్ చేస్తారనుకొన్నారు. కానీ పోస్టర్ తో సరిపెట్టేసింది చిత్రబృందం. అఖిల్ కి క్రికెట్ పై మక్కువ ఎక్కువ. వీలు ఉన్నప్పుడల్లా ఆడేస్తుంటాడు. సీసీఎల్ లో తానే సెంట్రాఫ్ ఎట్రాక్షన్. క్రికెట్ కిట్టులు కూడా తెగ కొంటుంటాడు. ఆ కిట్టుపై ఉన్న శ్రద్ద స్క్రిప్టుపై పెడితే బాగుంటుందన్నది అభిమానుల ఆశ. కాకపోతే.. అఖిల్ కూడా గట్టిగానే కష్టపడుతుంటాడు. కానీ ఫలితం దక్కడం లేదు. ఈసారి `లెనిన్` అఖిల్ కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తుందేమో చూడాలి.
