ఈ రోజుల్లో హీరోల పెళ్లి అంటే అది ఒక పెద్ద వేడుక. వారం రోజుల ముందుగానే ప్రతి తంతు వైరల్గా మారిపోతుంది. మీడియాకి ఆహ్వానాలు, సోషల్ మీడియాలో పోస్టులు, ప్రతి ఫోటో ఫ్యాన్స్, ఇన్ఫ్లూయెన్సర్ల గ్రూపుల్లో చెక్కర్లు కొట్టడాలు.. అబ్బో బోలెడు హంగామా. అయితే అఖిల్ పెళ్లి మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. ఈ రోజు ఉదయం అఖిల్ పెళ్లి జరిగిపోయింది. తన ప్రియురాలు జైనబ్ రవ్జీని వివాహమాడారు అఖిల్. హైదరాబాద్లోని నాగార్జున నివాసంలో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
నిజానికి అఖిల్ పెళ్లి డేట్ కూడా అధికారికంగా మీడియాకు వెల్లడించలేదు నాగార్జున. ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు బయటకి వదల్లేదు. ఇరు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులను కలసి ఆహ్వానించారు కానీ వాటిని కూడా వార్తల్లో ప్రచారం చేయడానికి ఇష్టపడలేదు. ఇదంతా గమనిస్తే, అఖిల్ పెళ్లిని నాగార్జున లో ప్రొఫైల్లోనే చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.