గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వరుస ఫిర్యాదులతో వార్తల్లో నిలిచిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇప్పుడు గడ్డుకాలం ఎదురవుతోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ , అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆయన చేసిన ఫిర్యాదులపై సరైన సాక్ష్యాధారాలు లేవని ఏపీ సీఐడీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది.
ఈ క్రమంలో, సాక్ష్యాలు లేనందున కేసును ఎందుకు మూసివేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఏపీ ఏసీబీ అధికారులు హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లి తాజాగా నోటీసులు అందజేశారు. రాజధాని భూముల విషయంలో ఒక్క రైతు కూడా స్వచ్ఛందంగా ఫిర్యాదు చేయకపోయినప్పటికీ, ఆళ్ల రామకృష్ణారెడ్డి తానే బాధితుడిగా వ్యవహరిస్తూ ఫిర్యాదులు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రైతుల భూములను అక్రమంగా లాక్కున్నారంటూ ఆయన చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టిన అధికారులకు, క్షేత్రస్థాయిలో బలమైన ఆధారాలు లభించలేదు. దీంతో రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులు పెట్టారనే విమర్శలకు ఇప్పుడు మరింత బలం చేకూరుతోంది.
ఈ నెల 27వ తేదీన విజయవాడలోని ఏసీబీ కోర్టుకు హాజరుకావాలని అధికారులు నోటీసుల్లో స్పష్టం చేశారు. కేసును మూసివేసే ప్రక్రియలో భాగంగా ఫిర్యాదుదారుగా ఆయన తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను కోర్టు ముందు ఉంచాల్సి ఉంటుంది. ఒకవేళ బలమైన ఆధారాలు చూపని పక్షంలో, ఈ కేసులు వీగిపోయే అవకాశం ఉంది. దీంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడిన చందంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిస్థితి తయారైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాజధాని ప్రాంతంలో కుట్రపూరితంగా కేసులు పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆళ్ల, ఇప్పుడు కోర్టు బోనులో ఎలాంటి సమాధానం చెప్తారనేది ఆసక్తికరంగా మారింది. నాటి ప్రభుత్వ ఒత్తిళ్లతోనే ఇలాంటి అక్రమ కేసులు బనాయించారన్న వాదనలకు, తాజా ఏసీబీ నోటీసులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ నెల 27న కోర్టు విచారణ అనంతరం ఈ కేసుల భవితవ్యంపై పూర్తి స్పష్టత రానుంది.
ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో జగన్ పై అసంతృప్తితో పార్టీ మారారు. షర్మిలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. మళ్లీ బయటకు వచ్చారు. వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో లోకేష్ ను ఓడించడానికి మంగళగిరిలో పని చేశారు. కానీ ఆ తర్వాత కనిపించడం లేదు. ఆయన సోదరుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా వైసీపీలో పెద్దగా యాక్టివ్ గా లేరు.ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం తరచూ జరుగుతోంది.
