బోయ‌పాటి సినిమా ఉంది.. కానీ ఇప్పుడు కాదు

విన‌య విధేయ రామ త‌ర‌వాత బోయ‌పాటికి గ‌ట్టి బ్రేకే వ‌చ్చింది. ఈ సినిమాతో బోయ‌పాటి ఇమేజ్‌కి భారీ స్థాయిలో డామేజ్ అయిన మాట వాస్త‌వం. కాక‌పోతే… ఆయ‌న‌కు అవ‌కాశాలేం త‌గ్గ‌లేదు. వ‌స్తూనే ఉన్నాయి. ఇది వ‌ర‌కే గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా చేయ‌డానికి ఒప్పందం కూడా కుదిరింది. ఈరోజు ఓ సినిమా పంక్ష‌న్‌లో బోయ‌పాటితో ఓ సినిమా ఉంటుంద‌ని నిర్మాత అల్లు అర‌వింద్ కూడా హింట్ ఇచ్చేశారు. దాంతో ఈ కాంబో రేపో – మాపో మొద‌లైపోతుంద‌న్న‌ట్టు వార్త‌లు వండేస్తున్నాయి సోష‌ల్ మీడియా వ‌ర్గాలు. నిజానికి బోయ‌పాటి, గీతా ఆర్ట్స్‌ల కాంబో ఇప్పుడు అనుకున్న‌ది కాదు. `స‌రైనోడు` స‌మ‌యంలోనే గీతా ఆర్ట్స్ లో మ‌రో సినిమా చేయ‌డానికి బోయ‌పాటి సంతంకం చేశాడు. చిరంజీవి 151వ సినిమాకి బోయ‌పాటినే ద‌ర్శ‌కుడ‌ని ముందు ఫిక్స‌య్యారు. కానీ… చిరంజీవి ఆలోచ‌న మారింది. ఆయ‌న స‌డ‌న్‌గా `సైరా`ని రంగంలోకి దించారు. దాంతో గీతా ఆర్ట్స్‌లో బోయ‌పాటి సినిమా ప‌క్క‌కు వెళ్లిపోయింది. ఇప్పుడు కూడా చిరంజీవితో ఓసినిమా చేయాల‌ని బోయ‌పాటి ఆశ ప‌డుతున్నాడు. కానీ… అందుకు ఇంకా టైమ్ ప‌డుతుంది. విన‌య విధేయ రామా త‌ర‌వాత‌… బోయ‌పాటి తో ఓ సినిమా చేయ‌డానికి గీతా ఆర్ట్స్ సాహ‌సం చేయ‌కపోవొచ్చు. ఇటు బోయ‌పాటి కూడా త‌న చేతిలో ఉన్న క‌మిట్‌మెంట్స్ పూర్తి చేయాలి. బాల‌య్య‌తో బోయ‌పాటి ఓ సినిమా చేయాల్సివుంది. ఈలోగా ఎన్ని ఆఫ‌ర్లు వ‌చ్చినా, వాటిని ప‌క్క‌న పెడుతున్నాడు బోయ‌పాటి. బాల‌య్య‌తో ఓ హిట్టు కొట్టాడంటే… గీతా ఆర్ట్స్‌తో స‌హా అగ్ర నిర్మాణ సంస్థ‌ల‌న్నీ త‌న వెంట ప‌డ‌తాయ‌ని బోయ‌పాటికి కూడా బాగా తెలుసు. అందుకే త‌న ఫోక‌స్ అంతా… బాల‌య్య సినిమాపైనే పెట్టాడు బోయ‌పాటి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com