ఇది వరకు తెలుగు సినిమాకు జాతీయ అవార్డు దక్కడం చాలా అరుదైన ఘనత. ఇప్పుడు మన సినిమా ఆస్కార్ వరకూ వెళ్లిపోయింది. జాతీయ అవార్డులు పెద్ద విషయం ఏమీ కాదు. అల్లు అర్జున్ ‘పుష్ప’తో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కించుకొన్నారు. త్వరలోనే రష్మికకు కూడా ఈ గౌరవం దక్కితే ఆశ్చర్యపోకండి అంటూ ముందే అల్లు అరవింద్ ప్రిపేర్ చేస్తున్నారు.
గీతా ఆర్ట్స్ లో రూపొందించిన ‘గాళ్ ఫ్రెండ్’ సినిమాలో రష్మిక నటించిన సంగతి తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈరోజు ట్రైలర్ వదిలారు. ట్రైలర్ మొత్తం.. రష్మిక హావానే. తనలోని విభిన్నమైన పార్శ్వాల్ని ఈ పాత్రతో చూపించే ప్రయత్నం చేశారు. ఎమోషనల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటేనే ఇలాంటి పాత్రల్ని వెండి తెరపై పండించగలరు. రష్మిక క్యారెక్టరైజేషన్, తను నటించిన విధానం చూస్తుంటే తప్పకుండా ఈ పాత్ర తన కెరీర్లో గుర్తుండిపోయేలా మలిచారన్న నమ్మకం కలుగుతోంది. యానిమల్, డియర్ కామ్రేడ్, పుష్పలో కూడా రష్మిక అదరగొట్టే నటన ప్రదర్శించింది. వాటికి మించిన ప్రతిభ ‘గాళ్ ఫ్రెండ్’ లో కనిపిస్తే జాతీయ అవార్డు రావడం పెద్ద విషయమేం కాదు. తెలుగు సినిమా నుంచి హీరోయిన్లకు జాతీయ అవార్డు దక్కి కూడా చాలా కాలం అయ్యింది. ఆ లోటు రష్మిక తీరిస్తే ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదు. అందుకే అల్లు అరవింద్ కూడా ఇదే విషయం నమ్మకంతో చెబుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఆయనే విడుదల చేశారు. సినిమా కూడా చూసుంటారు. అందులో రష్మిక ప్రతిభని గమనించే ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారు. అరవింద్ మాత్రమే కాదు.. బన్నీవాస్, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా రష్మిక పాత్ర, అందులో ఆమె నటన మర్చిపోలేని విధంగా ఉంటుందని ఊరిస్తున్నారు. వీరందరి మాటలూ నిజమై, రష్మికకు జాతీయ అవార్డు వస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది?