అమీర్ ఖాన్ ఇప్పుడు తన నెత్తిమీద ఓ భారీ ప్రాజెక్ట్ వేసుకొన్నాడు. మహాభారత గాథని ఐదు భాగాలుగా తీయాలన్నది అమీర్ డ్రీమ్. అందుకోసం సన్నాహాలు చేస్తున్నాడు. తొలి భాగానికి సంజయ్ లీలా బన్సాలీ దర్శకుడని తెలుస్తోంది. ఇందులో కాస్టింగ్ కూడా పెద్దగానే ఉండబోతోంది. ముఖ్యంగా సౌత్ నుంచి అగ్ర నటీనటుల్ని ఈ ప్రాజెక్టులో భాగస్వాముల్ని చేయడానికి అమీర్ శాయశక్తులా కృషి చేస్తున్నాడు. అందులో భాగంగా అర్జునుడి పాత్ర కోసం అల్లు అర్జున్ ని సంప్రదించినట్టు తెలుస్తోంది.
ఇటీవల అట్లీ సినిమా కోసం ముంబై వెళ్లాడు బన్నీ. ఆ సమయంలోనే అమీర్ ఖాన్ని కలిశాడు. ఇది పూర్తిగా ప్రొఫెషనల్ మీటింగ్ అని తెలుస్తోంది. అమీర్ తన మహాభారత్ ప్రాజెక్ట్ కోసమే బన్నీని కలిశాడని, వీరిద్దరి మధ్యా చర్చలు నడిచాయని ఇన్ సైడ్ వర్గాల టాక్. సంజయ్ లీలా భన్సాలీ కూడా చాలా కాలంగా బన్నీతో కలిసి పని చేయాలని చూస్తున్నారు. ఒకట్రెండుసార్లు బన్నీని కలిశారు కూడా. ఇప్పుడు మహాభారత్ ప్రాజెక్ట్ తో ఈ కాంబో సెట్ అవ్వబోతోందన్నమాట.
ఈ ఐదు భాగాల్నీ ఐదుగురు దర్శకులకు అప్పగించి, ఆరు నెలల గ్యాప్ తో ఒక్కో భాగాన్నీ విడుదల చేయాలన్నది అమీర్ ఆలోచన. ఇందుకోసం దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు పెడుతున్నాడట. కృష్ణుడి పాత్రలో అమీర్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన పాత్రల్లోనూ స్టార్లే ఉంటారు. ద్రౌపతి కోసం అన్వేషణ జరుగుతోంది. ఈ ఛాన్స్ సైతం దక్షిణాది తారకే దక్కే అవకాశం ఉంది.