అమరావతి నిర్మాణం ఇప్పుడు పరుగులు పెడుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన నిర్మాణాల కోసం దాదాపుగా పదిహేను వేల మంది నిరంతరం పనులు చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చే మెటీరియల్ కోసం వందల లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఒకప్పుడు పాడుబెట్టిన అమరావతి ఇప్పుడు ఇలా కళకళలాడిపోవడం అందర్నీ సంతృప్తి పరుస్తోంది. కానీ ఎప్పుడూ ఏదో ఒకటి అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండలేని వారు మాత్రం రైతుల సమస్యలనూ తెరపైకి తెస్తున్నారు. అయితే ఇవన్నీ వ్యక్తిగతమైనవే కానీ.. మూకుమ్మడిగా రైతులకు సంబంధించినవి కావు.
కొంత మంది రైతులకు వ్యక్తిగత సమస్యలు
అమరావతి రైతులకు సమస్యలు అంటూ ఇటీవలి కాలంలో కొంత ప్రచారం జరుగుతోంది. కొంత మంది రైతుల వ్యక్తిగత సమస్యల వల్ల పరిష్కారం పెండింగ్ లో ఉన్న సమస్యలేనని వాటి గురించి తెలిస్తే అర్థమైపోతుంది. భూసమీకరణ చేసినప్పుడు కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు. వాటి ప్రకారమే ఏ సమస్యనైనా పరిష్కరించాలి. అప్పటికీ ఆ రూల్స్ అన్నీ రైతుల ఆమోదంతోనే పెట్టారు. వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించే ప్రాసెస్ కూడా రెడీ చేశారు. అయితే కొంత మంది తమ సమస్యల్ని పరిష్కరించడం లేదని.. మీడియా ప్రతినిధులకు చెబుతున్నారు. వారు బయటపెడుతున్న వివరాలు వారి సైడ్ నుంచి మాత్రమే. అసలు వివాదం ఎందుకు వచ్చిందో మాత్రం చెప్పడం లేదు. పరిష్కారానికి ఉన్న అటంకాలేమిటో సీఆర్డీఏ అధికారులకే తెలుసు.
పరిష్కారానికి సీఆర్డీఏ ప్రత్యేక వ్యవస్థ
రైతుల సమస్యల పరిష్కారానికి సీఆర్డీఏ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. వ్యక్తిగతి సమస్యలు తప్ప.. రైతులకు మూకుమ్మడిగా విధానపరంగా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తోంది. అసైన్డ్ భూముల ఇచ్చిన వారికి తిరిగి ఇస్తున్న పట్టాల్లో అసైన్డ్ అనే పదం ఉంటే వారికి ఇబ్బందిగా ఉంటుందన్న ఫిర్యాదు రావడంతో వెంటనే పరిష్కరించారు. ఇలాంటివి చాలా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు.
వచ్చే రెండేళ్లలో రైతుల త్యాగాలకు తగ్గ ప్రతిఫలం
రైతులకు ఏదైనా అసంతృప్తి ఉంది అంటే.. ఐదు సంవత్సరాల పాటు అమరావతిని పాడు బెట్టడం వల్ల జరిగిన ఆలస్యం వల్లనే. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. రైతులకు కేటాయించిన ప్లాట్లలో వేగంగా మౌలిక సదుపాయాల నిర్మాణమూ జరుగుతుంది. ఆలస్యమైనా తమకు న్యాయం జరుగుతుందని.. తమ త్యాగనికి తగ్గ ఫలితం ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు. అయితే తమ యాజమాన్య హక్కుల విషయంలో ఏర్పడే వివాదాలను సీఆర్డీఏ పరిష్కరించడం లేదని ఆరోపణలు చేయడం ద్వారా సమస్య తీవ్రతను కొంతమంది పెంచుతున్నారు. అలాంటి సమస్యల పరిష్కారానికీ సీఆర్డీఏ ఏదో ఒకటి ఆలోచించాల్సిందే.