అమరావతి రైతులు తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని అసంతృప్తితో ఉన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు ముగ్గురు నేతలతో కమిటీని నియమించారు. తానే స్వయంగా సమావేశమయ్యారు. వారు ప్రస్తావించిన సమస్యలు అమరావతి ముందుకు సాగే కొద్దీ పరిష్కారం అవుతాయి. ప్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించడం నుంచి వారు ప్రస్తావించిన సమస్యలన్నీ పరిష్కారమయ్యేవే. కానీ వారికి ఆ భరోసా కల్పించడానికి సీఆర్డీఏ అధికారులు సిద్ధపడలేదు. అందుకే రైతులు అసంతృప్తికి గురయ్యారు.
భూములిచ్చిన రైతులకు సమగ్ర సమాచారం ఉండాలి !
అమరావతి సాకారం అవుతోందంటే దానికి కారణం రైతులే. ఓ పరిశ్రమ కోసం వంద ఎకరాలు సేకరించాలంటే .. ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటిది రాజధాని కోసం వేల ఎకరాలు రైతులు ఇచ్చారు.సమస్యలు రాలేదు. వారి నమ్మకం అలాంటిది. రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సింది ప్రభుత్వమే. ఆ బాద్యత సీఆర్డీఏది. రైతుల విషయంలో సీఆర్డీఏ గతంలో ఎంతో బాధ్యతగా ఉండేది కానీ.. ఇప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వారిని పట్టించుకోవడంలేదు. అందుకే రైతుల్లో అసంతృప్తి ఏర్పడింది.
రైతులకు మేలు జరగకపోతే అమరావతికి అర్థం ఉండదు!
అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు మేలు జరగకపోతే.. అమరావతి రాజధాని అనే దానికి అర్థం ఉండదు. వారు జీవనాధారమైన పంటపొలాలను ఇచ్చారు. అందుకే వారికి అమరావతి అభివృద్ధిలో సమానమైన వాటా లభించాలి. అమరావతితో పాటు అభివృద్ధి చెందాలి. లేనిపోని సమస్యలు ఎదుర్కోకూడదు. కావాలనకుంటే.. రైతులకు నిరంతరం సమాచారం అందించేందుకు.. వారి అనుమానాలను పరిష్కరించేందుకు ప్రత్యేక డిపార్టుమెంట్ ను పెట్టాలి. వారే సమస్యలతో తమ వద్దకు వచ్చే బదులు.. ఎప్పటికప్పుడు వారితో టచ్ లోఉండే వ్యవస్థను రూపొందించుకుంటే ప్రభుత్వం తమను పట్టించుకుంటుందన్న భరోసాతో రైతులు ఉంటారు.
రెండో దశ భూసమీకరణకూ నమ్మకమే ముఖ్యం
మొదటి దశలో భూములు ఇచ్చిన రైతులకు మేలు జరుగుతుంది.. వారు అమరావతితో పాటు అభివృద్ధి చెందుతారు అని అనుకుంటేనే రెండో విడద భూ సమీకరణకు రైతులు ముందుకు వస్తారు. మొదటి విడతలో అందరూ స్వాగతించినా.. రెండో విడతలో కొంత వ్యతిరేకత కనిపించడానికి కారణం అలాంటి నమ్మకం తగ్గడమే. అందుకే తక్షణం సీఆర్డీఏ.. రైతుల్ని చూసే దృక్పథాన్ని మార్చి.. నిరంతరం వారితో టచ్ లో ఉండేలా ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలి.