ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అమరావతికి అత్యున్నత చట్టబద్ధత కల్పించే చారిత్రక నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. గత ప్రభుత్వ హయాంలో తలెత్తిన గందరగోళానికి స్వస్తి పలికి, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కొత్త రాజధాని అనే పదం స్థానంలో అమరావతి పేరును అధికారికంగా చేర్చాలని నిర్ణయించారు. ఈ చారిత్రక తీర్మానాన్ని ఎల్లుండి అసెంబ్లీ వేదికగా ప్రవేశపెట్టి, సభ ఆమోదం పొందిన వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ సహచరులతో మాట్లాడుతూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. అమరావతి కేవలం ఒక నగరం కాదని, అది ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆయన స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ పడిన అవమానాలను తుడిచిపెట్టే సమయం ఆసన్నమైందని, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అమరావతిని భారత గెజిట్లో శాశ్వతంగా నిలిచేలా చేస్తామని భరోసా ఇచ్చారు. రాజధాని విషయంలో ఇకపై ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర కేబినెట్ తీర్మానం అనంతరం ఢిల్లీ స్థాయిలో పరిణామాలు శరవేగంగా మారనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో అమరావతి చట్టబద్ధత అంశం చర్చకు రానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన తీర్మానం ఆధారంగా, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సవరణలు చేసేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధానిగా అమరావతికి పార్లమెంటు రక్షణ కల్పించడం ద్వారా భవిష్యత్తులో రాజకీయ మార్పులు జరిగినా రాజధానిని మార్చే అవకాశం లేకుండా పకడ్బందీ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.
కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే, పార్లమెంటులో విభజన చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుకు ఉభయ సభల ఆమోద ముద్ర వేయడం ద్వారా అమరావతికి రాజ్యాంగబద్ధమైన గుర్తింపు లభిస్తుంది. భవిష్యత్లో ఎవరూ మార్చలేరు.
