చర్చిల్లో పాస్టర్లు సందేశాలు ఇచ్చినట్లుగా.. ప్రెస్మీట్లలో మాట్లాడేవారు వైసీపీలో కొంత మంది మంది ఉంటారు. అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డివంటి వారి స్పీచ్‌లు చూస్తే.. వారు ప్రెస్‌తో మాట్లాడుతున్నట్లుగా ఉండదు. ఏదో సందేశం ఇచ్చేందుకు నాటకీయంగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంటుంది. అలాంటి ప్రయత్నాల్లో ఇప్పుడు వారు ప్రజల్ని ఎంటర్టెయిన్ చేస్తున్నారు. తిరుమల వ్యవహారాల్లో భూమన…ఇతర అంశాల్లో అంబటి తమదైన శైలిలో వైరల్ అయిపోతున్నారు. వైసీపీకి వీళ్లు చాలు అని కాస్త తెలివి ఉన్న క్యాడర్ ఉస్సూరుమంటున్నారు.
అమరావతిపై అంబటి చేసిన వ్యాఖ్యలు చాలు
అమరావతిపై అంబటి రాంబాబు చేసిన ఖర్మ.. వ్యాక్యలు వైసీపీ స్ట్రాటజీని మరోసారి ప్రజల ముందు పెట్టాయి. ఎవరైనా ప్రభుత్వ స్థాయిలో పెద్ద పెద్ద ఆలోచనలు చేసి అమలు చేయాలనుకుంటారు. మనకెందుకు ప్రపంచ స్థాయి రాజధాని అనే వాళ్లుంటారా?. ఒక్క వైసీపీలోనే ఉంటారు. ఆ ఒక్క మాటతో అయిన డ్యామేజీ ఎంతో వైసీపీ విశ్లేషించుకుంటే.. అంబటి రాంబాబు తమను నిలువును మరోసారి పాతి పెట్టాడని క్లారిటీ వచ్చేస్తుంది. అదొక్కటే కాదు అంబటి రాంబాబు ప్రెస్‌మీట్ పెట్టినప్పుడల్లా ఆయన చేసే వ్యాఖ్యలు, విమర్శలు గుత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లుగానే ఉంటాయి…కానీ ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబించవు.
పిల్లల అసెంబ్లీని తప్పు పట్టాలనుకుని పరువు పోగొట్టుకున్న అంబటి
పిల్లల అసెంబ్లీని కూడా అంబటి రాంబాబు తప్పు పట్టాలనుకున్నారు. ప్రెస్ మీట్లో స్పీకర్ చైర్లో పిల్లల్ని కూర్చోబెట్టారని ఇది ప్రజాస్వామ్యానికి అవమానం అని వాదించబోయారు.కానీ అది పిల్లల కోసం ప్రత్యేకంగా చేసిన ఏర్పాటు అని జర్నలిస్టులు చెబితే సర్దుకున్నారు. కనీస సమాచారం లేకుండా.. పిల్లల అసెంబ్లీపైనా నిందలేయడానికి ఆయన రెడీ అయ్యారంటే .. అంబటి రాంబాబు పరిస్థితి.. ఆయనతో ప్రెస్‌మీట్ లు పెట్టించే వైసీపీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
వైసీపీకి మాట్లాడేవారే కరవు !
వైసీపీ తరపున మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది ఎవరంటే.. ఓ అంబటి రాంబాబు.. లేకపోతే పేర్ని నాని, పవన్ కల్యాణ్ ను తిట్టాలన్నా..జగన్ చేసే, చేసిన నిర్వాకాలను సమర్థించుకోవాలన్నా పేర్ని నాని వస్తారు. ఆయన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి.. ఒకటికి రెండు తప్పులు చేస్తాం.. మీరేం చేస్తారో చేసుకోండన్నట్లుగా మాట్లాడి వెళ్లిపోతారు. అంతకు మించి వైసీపీ విధానాలను ప్రజల ముందు బలంగా పెట్టే అధికార ప్రతినిధి ఒక్కరు కూడా లేరు. జగన్ రెడ్డి ప్రెస్‌మీట్ పెడితే ఆయన చెప్పేదేదీ ప్రజలకు ఎక్కదు. అతకని విధంగా ఆయన చెప్పే మాటలే వైరల్ అవుతాయి. అందుకే వైసీపీ ట్రోలింగ్ స్టఫ్‌గా మారుతోంది..సీరియస్ పార్టీగా మాత్రం కనిపించడం లేదు.
