తెలుగు రాష్ట్రాల్లో తమకంటూ గ్రౌండ్ లెవల్ నుంచీ కార్యకర్తలను డెవలప్ చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ ఎప్పటినుంచో భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ అవకాశం లేకపోయినా తాజాగా తెలుగు రాష్ట్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలుగా విభజించిన అనంతరం కమలనాథుల దృష్టి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై గట్టిగానే పడిందని చెప్పుకోవాలి. ఈ తరుణంలో మోడీ మానియాలో భాగంగా ఏపీలో కాస్త పుంజుకున్నట్లు కనిపించినా… టీడీపీ మిత్రపక్షంగా, టీడీపీ సౌజన్యంతో మాత్రమే నిలదొక్కుకోగలుగుతుందనే కామెంట్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తూనే ఉంది. దానికి కారణం… బీజేపీలో ఉన్న చంద్రబాబు సానుభూతిపరులే అనే విమర్శ కూడా ఉంది!! ఆ సంగతి అటుంచి ఏపీ విషయాలు కాసేపు పక్కనపెడితే… తాజాగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తుంది బీజేపీ.
ఏమాటకామాట చెప్పుకోవాలంటే ప్రస్తుతం తెలంగాణలో తెరాసకు ధీటుగా బలమైన ప్రతిపక్ష శక్తి లేదనే చెప్పాలి. ఈ క్రమంలో ఆ స్థానన్ని భర్తీ చేయడంలో ముందుకు వెళ్లాలని భావిస్తోన్న బీజేపీ ఆ విషయంలో మరో అడుగు ముందుకేస్తుంది. ఈ క్రమంలో మరోమారు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న అమిత్ షా… ఈ దఫా రెండు రోజుల పాటు రాష్ట్రంలోనే తిష్ట వేయనున్నారు. ఈ సందర్భంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆద్యంతం ఆయన పర్యవేక్షణలోనే కొనసాగనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అనేవి ఆయా రాష్ట్రాల అధ్యక్షుల పర్యవేక్షణలోనే కొనసాగుతాయి. అయితే తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మాత్రం పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో అమిత్ షా సమక్షంలో జరగడం… తెలంగాణ విషయంలో బీజేపీ ఎంత సీరియస్ గా ఉందనే విషయాలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల పాటు హైదరాబాదు, భద్రాచలంల్లో ఉండే అమిత్ షా… రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు ఏ తరహా వ్యూహాలు రచించుకుని వస్తున్నారన్న ఆసక్తి కాషాయ దళంలో నెలకొంది.
ఆ సంగతులు అలా ఉంటే… బీజేపీ తో తెరాస దోస్తీ అనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్న సంగతి తెలిసిందే. తెరాస ఎంపీ కవితకు కేంద్రంలో మంత్రిపదవి దక్కే అవకాశం ఉందనే వార్తలు గతంలో వచ్చాయి కూడా! ఇదే క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వంపై కాంగ్రెస్, టీడీపీ పోరాటం చేసిన స్థాయిలో బీజేపీ చేసిన దాఖలాలు కూడా తక్కువనే అనుకోవాలి! ఈ క్రమంలో అమిత్ షా వ్యూహం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. తెరాసతో బీజేపీది స్నేహమా… రణమా… అనేది తెలిసే వీలు ఇప్పట్లో లేదనే వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం!