ఈ సంక్రాంతి పోటీ మామూలుగా లేదు. పెద్ద సినిమాలూ, మీడియం రేంజు చిత్రాలూ, డబ్బింగ్ బొమ్మలు ఎగబడుతున్నాయి. మొత్తంగా చూస్తే 7 సినిమాలు వస్తున్నాయి. అందులో ‘అనగనగా ఒక రాజు’ కూడా వుంది. మిగిలిన సినిమాల పరిస్థితి ఒకలా ఉంటే, అనగనగా ఒక రాజు పరిస్థితి మరోలా ఉంది. ఆఖర్లో కాస్త హడావుడి పడుతున్నట్టు తోస్తోంది. సోమ, మంగళవారాలు కూడా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు షూట్ చేశారు. ఫైనల్ కాపీ ఎప్పుడు రెడీ అవుతుందో, సెన్సార్ ఎప్పుడు పూర్తి చేస్తారో అనిపిస్తోంది.
ఈరోజు (బుధవారం) ట్రైలర్ రావాల్సివుంది. కానీ గురువారానికి వాయిదా పడింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒకటి చేయాలి. హీరో బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వాలి. ఇలా చాలా తతంగం ఉంది. సంక్రాంతికి రావాలని ఫిక్సయిన సినిమా ఇది. రిలీజ్ డేట్ ముందే తెలుసు. అలాంటప్పుడు ముందే సినిమా షూట్ పూర్తి చేసి, ఫైనల్ కాపీ చేతిలో ఉంచుకోవాలి. అయితే చివర్లో కొన్ని రీషూట్లు భుజాన ఎత్తుకోవడం వల్ల, మళ్లీ కెమెరాలు ఆన్ చేయాల్సివచ్చింది. శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇలానే ఉంది. షూటింగ్ పూర్తయిపోయింది కానీ.. సెన్సార్ ఇంకా జరగలేదు. ప్రమోషన్లు మొదలవ్వలేదు. ట్రైలర్ ఇంకా రాలేదు. శర్వా మీడియా ముందుకు ఎప్పుడొస్తాడో తెలీదు. సంక్రాంతికి టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు ప్రమోషన్ల పరంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆఖర్లో ఇలా హడావుడి పడితే లాభం ఉండదు.
