చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన తర్వాత చనిపోయిన వారికుటుంబాల గాధలు వింటున్నవారి గుండెలు తడారిపోతున్నాయి. ఒక్క చేవెళ్ల ప్రమాదం మాత్రమే కాదు.. అహ్మదాబాద్ విమాన దుర్ఘటన.. కర్నూలు బస్సు ప్రమాదం…కాశీబుగ్గ ఆలయం ఇలా ఏ ప్రమాదంలో చూసినా మృతుల కుటుంబాల పరిస్థితి ఒక్క ఘటనతో తలకిందులుగా అయిపోతాయి. ఇంటిని నడిపించే భర్త అయినా.. ఇంటికి దీపం లాంటి ఇల్లాలు అయినా.. కంటికి వెలుగుల్లాంటి పిల్లలు అయినా ఏ ఒక్కరికి ప్రమాదం జరిగినా ఆ కుటుంబం పడే మానసిక వేదన అంతా ఇంతా కాదు. అదే మరణాలు సంభవిస్తే ఆ లోటు పూడ్చుకుని ముందుకు సాగడం దుర్లభంగా మారుతుంది. అప్పటి వరకూ ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబాల్లో ఈ ప్రమాదాలు తీర్చుకోలేని కష్టాలను తెచ్చి పెడుతాయి.
ఒక్కో కుటుంబానిది ఒక్కో కన్నీటి సముద్రం
ముగ్గురు పిల్లల్ని ఒకే సారి ప్రమాదంలో కోల్పోయిన తండ్రి.. ఇక తన జీవితానికి అర్థం ఏమిటని గుండెలవిసేలా రోదిస్తే దానికి ఎవరు సమాధానం చెప్పగలరు..?. ఆ తండ్రిని ఏమని ఓదార్చగలరు?. తల్లిదండ్రులిద్దరూ ప్రమాదంలో కోల్పోతే లోకం తెలియని చిన్నారులకు ఇక తోడుండెదెవరు?. పొత్తిళ్లలో పెట్టుకుని అపురూపంగా చూసుకుంటున్న బిడ్డతో సహా ఆ తల్లి కంకర రాళ్ల కింద నలిగిపోతే ఆ ఇంటి పెద్ద గుండె తట్టుకోగలుగుతుందా?. ఇలా ఎన్నో విషాద గాధలు.. చెవేళ్ల ప్రమాదంలో అందర్నీ కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రతీ ప్రమాదంలోనూ ఇలాంటివి ఉంటాయి. అందుకే ప్రమాదాలు అంటే అత్యంత భయంకరం.
ఒక్కరి నిర్లక్ష్యం వల్లనే అనేక మందికి ప్రాణగండం
అసలు ప్రమాదాలు ఎలా జరుగుతాయి.. ఎందుకు జరుగుతాయని విశ్లేషిస్తే.. దేవుడేమి రాసి పెట్టడు. అంతా మానవ తప్పిదాలుగానే జరుగుతాయి దీనికి కారణం నిర్లక్ష్యం. ఆ ఏముందిలే రోజూ చేసే పనేగా .. ఈ రోజు చేయకపోతే ఏమవుతుందినే అనుకునేంత చిన్న నిర్లక్ష్యం వల్లనే ప్రమాదాలు జరుగుతాయి. కర్నూలు బస్సు ప్రమాదం అయినా.. చేవెళ్లే ప్రమాదం అయినా అంతే. చేవెళ్లలో టిప్పర్ డ్రైవర్ చేసిన తప్పిదం వల్ల ఇన్ని ప్రాణాలు పోయాయి. ఓ బస్సు ఎదురుగా వస్తున్నప్పుడు అంత వేగంగా వెళ్లకూడదు. కానీ వెళ్లాడు. నిద్ర మత్తులోనే.. వేగంగా వస్తున్న లారీ గుంతలో పడటం వల్లనే కానీ కంట్రోల్ తప్పింది. అంతే… ఇరవై జీవితాలు తెల్లారిపోయాయి. ఇక్కడ డ్రైవర్..కాస్త సంయమనం పాటించి ఉంటే.. ప్రమాదం జరిగేదే కాదు.
ప్రమాదాలను నివారించవచ్చు!
ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాలు ఈ చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్లే జరుగుతాయి. అదృష్టం ఎప్పుడూ కలిసి రాదు. కానీ ప్రమాదాలు ఎప్పుడైనా వస్తాయి. మన చేజేతులా తెచ్చుకుంటే వచ్చేస్తాయి. ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. నిజానికి రోడ్డు మీద మనం ఎంత జాగ్రత్తగా పోతున్నా.. ఇతరులు చేసే తప్పిదాల వల్ల మన మీదకు వాహనాలు దూసుకొచ్చేస్తాయి. అంటే మన తప్పు లేకుండా మనం బలైపోతాం. కొన్ని అలా ముంచుకొచ్చేస్తే ఏమీ చేయలేం కానీ.. చాలా విషయాల్లో తప్పించుకోవచ్చు. ప్రమాదాల బారిన పడి కుటుంబాలను ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే.. ఎంతో కొంత సమాజానికి కూడా మేలు చేసినట్లవుతుంది.
