అల్లు అర్జున్ ‘పుష్ప 2’ 2024 డిసెంబరులో విడులైంది.ఆ తరవాత కొంత గ్యాప్ తీసుకొని, అట్లీ సినిమా పనిలో పడిపోయారు. వీరిద్దరి కాంబినేషన్లో ‘రాకా’ రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అంతా ముంబైలోనే జరుగుతోంది. ఎంత మేర షూట్ జరిగింది? ఇంకెంత బ్యాలెన్స్ ఉంది? అనే విషయంలో చిత్రబృందం ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఫ్యాన్స్ లో ఓ క్లారిటీ ఉంది. 2027 డిసెంబరులో ఈ సినిమా వస్తుందని ఫిక్సయ్యారు. అంటే.. ఒక్క సినిమా కోసం మూడేళ్లన్నమాట.
‘పుష్ప’ తరవాత బన్నీపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగ్గట్టే బన్నీ తన కెరీర్ ప్లాన్ చేసుకొంటున్నాడు. క్వాలిటీ కోసం, పెరుగుతున్న అంచనాల్ని అందుకోవడం కోసం టైమ్ తీసుకోవడం ఓకే.కానీ ఒక్క సినిమాకు మరీ మూడేళ్లంటే… ఆలోచించాల్సిన విషయం.స్టార్ హీరోలు, సినిమా సినిమాకీ వెయ్యి కోట్ల వరకూ వ్యాపారం చేయగల సామర్థ్యం ఉన్న బన్నీ లాంటి హీరోలు ఇలా మూడేళ్లకో సినిమా తీస్తే పరిశ్రమకు ఇబ్బందే.
బన్నీ అనే కాదు.. ఇలా ఎక్కువ టైమ్ తీసుకొంటున్న హీరోలంతా పరిశ్రమ దృష్టి కోణంలోంచి, థియేటర్ ఫీడింగ్ వైపు నుంచి కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాన్ ఇండియా సినిమాలు తీసుకొంటూనే, భారీ సినిమాలు తీసుకొంటూనే మధ్యమధ్యలో లోకల్ కథలు, ఇక్కడి దర్శకులతో ప్రాజెక్టులు సెట్ చేసుకొంటే అభిమానులూ హ్యాపీగా ఫీలవుతారు. పరిశ్రమకూ మంచి జరుగుతుంది.
‘రాకా’ తరవాత బన్నీ లోకేష్ కనగరాజ్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఆయన కొంచెం ఫాస్ట్. యేడాదిలో సినిమా పూర్తి చేయగల సమర్థుడే. ఆ సినిమా అయినా త్వరగా పూర్తయి… విడుదల చేయగలిగితే ఈ మూడేళ్ల గ్యాప్ ని బన్నీ ఫిల్ చేసినట్టు అవుతుంది.
