ఇరాన్ ను నాశనం చేస్తాం.. భూమి మీద లేకుండా చేస్తాం.. ప్రపంచ పటంలో నుంచి తీసేస్తాం అని ట్రంప్ హూంకరిస్తున్నారు. ఇజ్రాయెల్ వంత పాడుతోంది. ఇంతకీ ఇరాన్ చేసిన నేరమేంటి ? ఆ దేశాన్ని ఎందుకిలా టార్గెట్ చేశారు? అన్నదానిపై మాత్రం ఇంకా అస్పష్టతగా ఉంది. ఆ దేశం ఇజ్రాయెల్ తో మాత్రమే శత్రుత్వాన్ని కొనసాగిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య పరిష్కరించలేని వివాదాలు ఉన్నాయి. అవి ప్రపంచానికి ఎప్పుడూముప్పుగా మారలేదు. కానీ అమెరికా జోక్యంతోనే అసలు సమస్య ప్రారంభమయింది. అమెరికాకూ ఇరాన్ పై కోపమే.
ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంపై అమెరికా ఆగ్రహం
అంతర్జాతీయ వేదికపై ఇరాన్ ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోపణ అణ్వాయుధాల తయారీ. ఇరాన్ శాంతియుత ప్రయోజనాల కోసమే అణు ఇంధనాన్ని తయారు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, అది ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని అణ్వాయుధాలను నిర్మిస్తోందని అమెరికా, ఇజ్రాయెల్ గట్టిగా నమ్ముతున్నాయి. 2026 ఫిబ్రవరిలో జరిగిన పరోక్ష చర్చలు విఫలమవ్వడం, ఇరాన్ తన యురేనియం నిల్వలను గణనీయంగా పెంచుకోవడం యుద్ధానికి ప్రధాన కారణమయ్యాయి. తమ ఉనికికే ముప్పు తెచ్చే అణ్వాయుధాలు ఇరాన్ చేతికి చిక్కకూడదనే ఏకైక లక్ష్యంతో ఇజ్రాయెల్ ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో దాడులు ప్రారంభించింది.
టెర్రరిస్టులకు ఆర్థిక సాయం ఆరోపణలు
అమెరికా చేసిన మరో కీలక అభియోగం ప్రాంతీయ అస్థిరత. లెబనాన్‌లోని హిజ్బుల్లా, యెమెన్‌లోని హౌతీలు వంటి సాయుధ గ్రూపులకు ఇరాన్ ఆర్థికంగా, సైనికంగా మద్దతు ఇస్తూ మధ్యప్రాచ్యంలో అశాంతిని రేపుతోందని అమెరికా ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఎర్ర సముద్రం , హార్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై దాడులకు ఇరానే సూత్రధారి అని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం ప్రపంచ చమురు మార్కెట్‌ను కుదిపేసింది. దీనిని ఎనర్జీ టెర్రరిజం గా ట్రంప్ చెబుతున్నారు. తాము ఎప్పుడూ ముందుగా యుద్ధాన్ని ప్రారంభించలేదని, కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే స్పందిస్తున్నామని చెబుతోంది. 2024 నుంచి ఇజ్రాయెల్ వరుసగా ఇరాన్ సైనిక స్థావరాలు , శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని, దానికి ప్రతిచర్యగానే తాము మిస్సైళ్లను ప్రయోగించామని ఇరాన్ ఐక్యరాజ్యసమితిలో వాదించింది. తాము శాంతిని కోరుకుంటున్నామని, అయితే తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగితే ఎంతటి విధ్వంసానికైనా సిద్ధమని ఇరాన్ ఆర్మీ ప్రకటించింది.
రెండు దేశాల సమస్యను ప్రపంచ సమస్యగా మార్చింది ట్రంపే
ప్రస్తుతం పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో లభించిన ఈ రెండు వారాల గడువు అత్యంత కీలకమైనది. అమెరికా కోరుతున్నట్లుగా ఇరాన్ తన అణు కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయాలి , హార్ముజ్ జలసంధిని శాశ్వతంగా తెరవాలి. దీనికి ప్రతిగా ఇరాన్ తనపై ఉన్న ఆర్థిక ఆంక్షల తొలగింపు , యుద్ధ నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ చర్చలు సఫలమైతేనే..ప్రపంచానికి శాంతి లభిస్తుంది.


