మహాభారతంలో శల్యుడు, కర్ణుడి రథసారథిగా ఉంటూ అతనిలో లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తాడు. విలువిద్యలో మహావీరుడైన కర్ణుడు, శల్యుడు చెప్పిన సూటి పోటి మాటలు విని చివరికి తనకు ధనస్సు పట్టుకోవడం కూడా రాదేమో అన్న ఆత్మన్యూనతకు లోనవుతాడు. ఒక పక్షానికి సారథిగా ఉంటూనే ఆ పక్షం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే పరిస్థితులను ‘శల్య సారథ్యం’ అని అంటారు. సూపర్ 8 తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓటమి కూడా అదే పరిస్థితిని గుర్తు చేసింది. టీ20 ఫార్మాట్లో దిగ్గజంగా పేరున్న భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోవడం అవమానకరమే. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టుగా ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమికి కూడా అనేక కారణాలున్నాయి.
మొదట పిచ్ గురించి చెప్పుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంను ప్రమోట్ చేయడానికి బీసీసీఐ పెద్దలు నడుం బిగించారు. దేశానికి తలమానికంగా ఒక స్టేడియం ఉండటం తప్పేమీ కాదు. కానీ డూ ఆర్ డై మ్యాచుల్లో ఇలాంటి కొత్త మైదానాలను ఎంచుకుంటే ఫలితం ఎలా ఉంటుందో రోహిత్ శర్మని అడిగితే సమాధానంగా కన్నీళ్లు పెట్టుకుంటాడు.
గత వన్డే వరల్డ్‌కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వచ్చిన రోహిత్ సేనకి ఇదే మైదానం పీడకలగా మిగిలింది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో చితికిపోయింది. ఆతిథ్య దేశానికి వేదికలు ఎంపిక చేసే అవకాశం ఉన్నప్పటికీ ఫైనల్ కోసం అహ్మదాబాద్‌ను ఎంచుకోవడం అభిమానులకే నచ్చలేదు. “పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో తెలియకపోతే ఫైనల్ కోసం ఇదే వేదిక ఎందుకు?” అని అప్పుడే ప్రశ్నలు వచ్చాయి.
ఇప్పుడు జరుగుతున్న వరల్డ్‌కప్‌లో కూడా ఇదే మైదానం కీలకంగా మారింది. సూపర్ 8లో ప్రతి మ్యాచ్ ఫైనల్‌లాంటిదే. సఫారీ జట్టు చేతిలో ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. ఈ ఓటమిలో అహ్మదాబాద్ వికెట్ కీలక పాత్ర పోషించింది. ఓడిపోయిన చోటే గెలవాలని ప్రయత్నించడం మంచిదే కానీ యుద్ధభూమి ఎంచుకునే అవకాశం ఉన్నప్పుడు తెలివైన నాయకత్వం తమకు అలవాటైన మైదానానికే మొగ్గు చూపాలి.
ఈ మ్యాచ్ కోసం టీమ్ఇండియా చేసిన ప్రయోగాలు కూడా శల్య నీతిని గుర్తు చేశాయి. అహ్మదాబాద్ వికెట్‌పై స్పిన్ పెద్దగా పని చేయదని సఫారీ జట్టు అర్థం చేసుకుంది. కానీ ఆతిథ్య జట్టైన ఇండియాకు అదే అర్థం కాకపోవడం బాధాకరం. సఫారీలు నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగితే, భారత్ మాత్రం ఇద్దరు ఫుల్‌టైమ్ సీమర్లతోనే సరిపెట్టుకుంది. ఇక్కడే సగం మ్యాచ్ చేజారింది. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను తప్పించి వాషింగ్టన్ సుందర్‌ను తీసుకురావడం ఆశ్చర్యం కలిగించింది. సఫారీ జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నారని చెప్పి రైట్ ఆర్మ్ స్పిన్నర్‌ను ఆడించారు. అంతేకాదు, శివం దూబే స్థానంలో సుందర్‌ను బ్యాటింగ్‌కు పంపడం ఐపీఎల్ లాజిక్‌లా అనిపించింది. గుజరాత్ తరఫున ఆడిన అనుభవం అతనికి ఉపయోగపడుతుందని భావించినా ప్లాన్ పూర్తిగా విఫలమైంది. వికెట్లు తీయలేకపోయాడు, బ్యాటింగ్‌లోనూ నిలబడలేకపోయాడు.
మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా శిబిరంలో మరో ఒత్తిడి కనిపించింది. సంజు సామ్సన్, తిలక్ వర్మ మధ్య పోటీ వాతావరణం సృష్టించారు. నెట్స్‌లో సంజుకే ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. తిలక్ స్ట్రైక్‌రేట్‌పై అసంతృప్తి ఉన్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఈ ఒత్తిడి అతడి ఆటపై ప్రభావం చూపింది. రెండో బంతికే ముందుకు వచ్చి ఆడుతూ వికెట్ ఇచ్చేశాడు. అది తిలక్ సహజ శైలి కాదు. వికెట్‌పై కుదురుకున్నాకే అతడు పరుగులు పెంచుతాడు. ఈసారి మాత్రం తన స్టైల్‌కు భిన్నంగా ఆడి విఫలమయ్యాడు. ఇది నాయకత్వ లోపాన్ని మరోసారి బయటపెట్టింది. ఆటగాళ్ల బలాలపై దృష్టి పెట్టాలి కానీ చివరి నిమిషంలో ప్రయోగాలు చేయకూడదని ఈ మ్యాచ్ నిరూపించింది.
టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం అస్తవ్యస్తంగా కనిపించింది. అహ్మదాబాద్ పిచ్‌ను ఎక్కడా అర్థం చేసుకోలేకపోయారు. సఫారీ జట్టు పవర్‌ప్లేలో మూడు వికెట్లు కోల్పోయినా, మిడిల్ ఆర్డర్ టైమింగ్‌తో ఆడి మ్యాచ్‌ను కంట్రోల్ చేసింది. డేవిడ్ మిల్లర్ ఆటను గమనిస్తే గుజరాత్ ఐపీఎల్ అనుభవం ఎంత ఉపయోగపడిందో అర్థమవుతుంది. అతడు బలంగా కొట్టడం కంటే బంతిని టైమ్ చేయడంపైనే దృష్టి పెట్టాడు. కానీ ఇండియా బ్యాటర్లు మాత్రం బంతిని గట్టిగా కొట్టాలనే ప్రయత్నంలో వరుసగా వికెట్లు కోల్పోయారు. ఇషాన్ కిషన్, అభిషేక్, తిలక్, సూర్య, హార్దిక్, సుందర్, రింకు — అందరూ అదే తప్పు చేశారు. డగౌట్లో కూర్చున్న కోచ్ గంభీర్ కూడా పెద్దగా మార్గనిర్దేశం చేసినట్టు కనిపించలేదు. డెత్ ఓవర్లలో దాడి చేయాలని సూచించినా, మ్యాచ్ ఏడో ఓవర్‌కే సఫారీ చేతికి వెళ్లిపోయిందన్న విషయం గుర్తించలేకపోయారు.
సూపర్ 8 దశలో ప్రయోగాలకు చోటు లేదు. అయినప్పటికీ ఇండియా నాయకత్వం అవసరం లేని మార్పులు చేస్తోంది. సెమీస్‌కు వెళ్లే అవకాశాలు ఇంకా ఉన్నప్పటికీ మిగిలిన ప్రతి మ్యాచ్‌ను భారీ తేడాతో గెలవాలి. అలాగే సఫారీ జట్టు ఇకపై ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదు. ఇప్పుడు టీమ్ఇండియా పరిస్థితి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడేలా మారింది. ఏదేమైనా మన బలంపైనే దృష్టి పెట్టాలి. ఇలాంటి శల్య సారథ్యం నుంచి బయటపడకపోతే… టీమ్ఇండియా ప్రయాణం సూపర్ 8లోనే ముగిసే ప్రమాదం కూడా ఉంది.
