‘బేబీ’లాంటి హిట్ తరవాత ఆనంద్ దేవరకొండ ఆచి తూచి అడుగులేస్తున్నాడు. తన చేతిలో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ‘తక్షకుడు’ ఒకటి. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రూపొందించిన చిత్రమిది. వినోద్ దర్శకుడు. ఈ సినిమాని ఓటీటీ కోసం రూపొందించారు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇదో యాక్షన్ థ్రిల్లర్.
అటవీ నేపథ్యంలో సాగుతుంది. ఈరోజు టీజర్ విడుదల చేశారు. గాయాల పాలై.. అడవిలో దీన స్థితిలో పడి ఉన్న హీరోని తాండా ప్రజలు చేరదీస్తారు. కోలుకొంటున్న హీరోపై మళ్లీ దాడులు మొదలవుతాయి. ఇంతకీ తనపై దాడి చేస్తోంది ఎవరు? హీరో ఎవరి కోసం అన్వేషిస్తున్నాడు? ప్రేమకోసమా, పగ కోసమా? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకొంది. ఆనంద్ ఆహార్యం వైవిధ్యంగా కనిపించింది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర. తన పాత్రలో పలు డైమన్షన్స్ ఉన్నట్టు అర్థం అవుతోంది. అడవీ నేపథ్యంలో సాగే కథ ఇది. ఎక్కువ భాగం చీకట్లోనే సన్నివేశాల్ని తెరకెక్కించారు. కెమెరా వర్క్, నేపథ్య సంగీతం ఫీల్ ని క్యారీ చేశాయి. సితార లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఓటీటీ కోసం సినిమాల్ని నిర్మించడం, అందుకోసం ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్టులు ఎంచుకోవడం ఆహ్వానించదగిన పరిణామం. ఆనంద్ తోనే సితార మరో సినిమాని పట్టాలెక్కించింది. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన పనులు శర వేగంగా సాగుతున్నాయి. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందన్న విషయం త్వరలో తెలుస్తుంది.
