రాజకీయ అధికారం అనేది ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించడానికి ఉండాలి తప్ప, నేరస్తులకు అభయమివ్వడానికి కాదు. అనంతబాబు కేసులో ఎస్పీ స్థాయి నుండి ఎస్ఐ వరకు పోలీసు అధికారులు తమ వృత్తి ధర్మాన్ని విస్మరించి, నిందితుడిని కాపాడే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. చట్టాన్ని అమలు చేయాల్సిన వారే చట్టాన్ని చుట్టచుట్టి నిందితుడి కాళ్ల వద్ద పెట్టడం వెనుక కచ్చితంగా రాజకీయ అదృశ్య హస్తం ఉందన్నది బహిరంగ రహస్యం. హంతకులను కాపాడేందుకు వ్యవస్థలను దుర్వినియోగం చేయడం వల్ల పోలీసులు నేడు శిక్షార్హులుగా మిగిలిపోయారు.
వివేకా కేసులో సునీతపైనే కుట్ర
వివేకా హత్య కేసు వంటి సున్నితమైన అంశాల్లో కూడా బాధితులనే నిందితులుగా చిత్రించే కుతంత్రాలు గత ప్రభుత్వ హయాంలో జరిగాయన్న ఆరోపణలు తీవ్రమైనవి. నేరస్తులకు శిక్ష పడకుండా అడ్డుకోవడం అంటే సమాజంలో నేర ప్రవృత్తిని ప్రోత్సహించడమే. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి, చట్టం నుండి నేరస్తులను తప్పించేందుకు అధికారాన్ని అడ్డం పెట్టుకునే వారికి ప్రజా జీవితంలో ఉండే అర్హత ఎలా ఉంటుంది? రాజకీయ బాసుల కనుసన్నల్లో పనిచేస్తూ ఖాకీ చొక్కాకు మచ్చ తెచ్చే అధికారుల తీరు వ్యవస్థల పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సడలిస్తోంది.
నేరస్తులకు భరోసాగా సాగిన జగన్ పాలన
నేరస్తుల్ని కాపాడమని ఆ పోలీసులకు ఎవరు చెప్పి ఉంటారు?. అనంతబాబును .. ఆయన భార్యను ఎందుకు కాపాడి ఉంటారు?. హత్య చేసిన వాళ్లను కాపాడాలని ఎందుకు అనుకుంటారు ?. ఖచ్చితంగా వారికి రాజకీయ బాసుల ఆదేశాలు ఇచ్చి ఉంటారు. వివేకా హత్యకేసులో హంతకుల్ని పట్టుకోకుండా బాధితుల్ని నిందితులు చేయడానికే జగన్ హయాంలో పెద్ద కుట్రలు చేశారు. ఇక అనంతబాబును కాపాడకుండా ఎందుకు ఉంటారు. .? నేరస్తుల్ని కాపడటానికి రాజకీయ అధికారాన్ని దుర్వినియోగం చేసిన జగన్ లాంటి వారికి .. ప్రజలు ఎలాంటి శిక్ష వేయాలి. సమాజంలో నేరస్తులకు చట్టభయం, పోలీసు భయం లేకుండా వ్యక్తికి ప్రజా జీవితంలో ఉండేఅర్హత ఉంటుందా?
శిక్షిస్తేనే ప్రజలకు భరోసా!
నేరం ఎవరూ చేసినా అది నేరమే. రాజకీయం రక్షణ కవచంగా మారి నేరస్తులను కాపాడటం అనేది అరాచకత్వానికి దారితీస్తుంది. అనంతబాబు కేసులో పోలీసుల వైఫల్యం , రాజకీయ జోక్యంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులందరినీ శిక్షించినప్పుడే వ్యవస్థపై ప్రజలకు మళ్లీ విశ్వాసం కలుగుతుంది. నేరస్తులను పెంచి పోషించే సంస్కృతికి స్వస్తి పలకకపోతే, భవిష్యత్తులో నేరమే రాజ్యాంగంగా మారే ప్రమాదం ఉంది. సమాజంలో శాంతిభద్రతలు వర్ధిల్లాలంటే నేరస్తుడికి చట్టం అన్నా, పోలీసు అన్నా భయం ఉండాలి. కానీ, అధికార పార్టీ అండ ఉంటే ఏ నేరం చేసినా తప్పించుకోవచ్చనే ధీమా పెరిగినప్పుడు సామాన్యుడి ప్రాణానికి రక్షణ ఉండదు. నేరాన్ని కప్పిపుచ్చడం కూడా నేరమే అన్న సూత్రాన్ని విస్మరించి, అధికార దుర్వినియోగానికి పాల్పడే నాయకులకు ప్రజలు తమ ఓటు హక్కు ద్వారానే సరైన బుద్ధి చెప్పాలి. పదవి ఉంది కదా అని రాజ్యాంగ విలువలనే కాలరాసే వారికి ప్రజాస్వామ్యంలో చోటు ఉండకూడదు.
