డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలని రాజమండ్రి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎమ్మెల్సీ అనంతబాబు హైకోర్టుకు వెళ్లారు. అదనపు దర్యాప్తు చేయడానికి ఎలాంటి అదనపు ఆధారాలు లేవని…దర్యాప్తు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఇలా తన హత్యకేసులో దర్యాప్తు చేయవద్దని ఓ నిందితుడు పిటిషన్ వేయడం లాంటివి ఏపీలోనే జరుగుతూంటాయి. వైసీపీ నేతలే చేస్తూంటారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు చంపేశాడు. శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. మీడియా హడావుడి చేయకపోతే అలా వదిలేసేవారు.. మీడియా సొంతంగా ఆధారాలు బయట పెట్టడంతో అప్పుడు అనంతబాబుపై కేసు పెట్టారు. ఇంకా లోతుగా వెళ్లకుండా ఉండటానికి తానే హత్య చేశానని అంగీకరించాడు. కానీ కిడ్నాప్ చేసిన సుబ్రహ్మణ్యాన్ని ఎక్కడికి తీసుకెళ్లాడు… ఒక్కడే ఎలా చంపగలిగాడు.. చంపిన తర్వాత శవాన్ని కారులో ఒక్కడే ఎలా ఎత్తి పెట్టాడు.. మళ్లీ ఎలా దించాడు.. ఇలాంటి అనుమానాలు చాలా నివృతి కావాల్సి ఉంది.
ఈ హత్యలో మరికొంత మంది ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నా.. పోలీసులు అసలు ఎలాంటి దర్యాప్తు చేయలేదు. చార్జిషీటు కూడా సమయానికి వేయకపోవడంతో బెయిల్ వచ్చింది. బెయిల్ మీద వచ్చి ఆయన పోలీసుల్ని బెదిరించి రాజకీయాలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత సమగ్ర దర్యాప్తునకు కోర్టును ఆశ్రయించింది. కోర్టు దర్యాప్తు చేయాలని ఆదేశిస్తే.. వద్దని చెప్పి హైకోర్టుకు వెళ్లారు.