ఈనెల 27న రాబోతోంది ‘ఆంధ్రా కింగ్ తాలుకా’. ఇప్పటికే ఫైనల్ కట్.. 2 గంటల 45 నిమిషాలుగా తేలింది. ఓరకంగా పెద్ద సినిమానే అనుకోవాలి. అయితే… ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు చాలా ఫుటేజీ వచ్చిందట. 3 గంటల 15 నిమిషాల రన్ టైమ్ ని కుదించి.. కుదించి 2 గంటల 45 నిమిషాలకు తీసుకొచ్చారు. అంటే.. ఓవరాల్ గా ఫుటేజీ ఎంత ఉందో అర్థం చేసుకోవొచ్చు. ఎలాంటి సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర 3 గంటల ఫుటేజీ రావడం సాధారణమే. అందులోంచి ఫైనల్ కట్ డిసైడ్ చేయడం ఎడిటర్ పని. ఈసారి రామ్ కూడా దగ్గరుండి ఎడిట్ చేశాడని, ఫైనల్ కట్ పై పూర్తి సంతృప్తితో ఉన్నాడని టాక్. అంతేకాదు.. ఇప్పటికే సినిమాని ఉపేంద్ర చూసేశారు. ఆయనకు ఈ సినిమాపై, తన పాత్రపై గట్టి నమ్మకం ఏర్పడింది.
మహేష్ ఈ చిత్రానికి దర్శకుడు. కొత్త దర్శకులు ఫుటేజీ విషయంలో కంట్రోల్ లో ఉండరు. తాము రాసుకొన్న ప్రతీ సీన్ తెరపై చూడాలని ఆశ పడతారు. అందుకే.. రన్ టైమ్ చేతుల్లోంచి దాటిపోతుంటుంది. అయితే ఆడియన్ మైండ్ సెట్ మారింది. సినిమా బాగున్నప్పుడు లెంగ్త్ గురించి పట్టించుకోరు. ‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘యానిమల్’ ఇవన్నీ లెంగ్తీ సినిమాలే. అంతెందుకు.. బాహుబలి రెండు భాగాలూ కలిపి, నాలుగు గంటల సినిమాగా మార్చినా చూస్తారు. ‘ఆంధ్రా కింగ్’ 2 గంటల 45 నిమిషాలే కాబట్టి సర్దుకుపోవొచ్చు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. కర్నూల్ లో ట్రైలర్ ఆవిష్కరించారు. అక్కడ చిత్రబృందం చేసిన డ్రోన్ షో అందర్నీ ఆకట్టుకొంది. ఈ షో కోసమే దాదాపు రూ.1 కోటి ఖర్చు చేసినట్టు సమాచారం.


