ఏపీలో కూటమిలో ఉన్న మూడు పార్టీలు ఓ ఫార్ములా రూపొందించుకుని ఆ క్రమంలో పదవులు పంచుకుంటున్నాయి. స్థానిక ఎన్నికలు రాబోతున్న సమయంలో తమకు ఎక్కువ వాటా కావాలని బీజేపీ రాజకీయం ప్రారంభించింది. ఇప్పటికే పెద్దలు అడిగారని.. రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చారు. అడిగితే ఇచ్చేస్తున్నారని బీజేపీ నేతలు ఇప్పుడు లోకల్ పదవులు.. స్థానిక ఎన్నికల్లో సీట్లపై దృష్టి పెట్టారు.
ఐదు శాతం..ఐదు శాతం అంటున్నారని.. పార్టీ కోసం కష్టపడిన నేతలకు అవకాశాలు కల్పించాలని విష్ణుకుమార్ రాజు అంటున్నారు. బీజేపీ కోసం ఎంత మంది కష్టపడ్డారో.. ఎలా కష్టపడ్డారో కానీ వారి కంటే ఎక్కువగా టీడీపీ, జనేసన పార్టీ నేతలు కష్టపడి ఉంటారు. వారికి అన్యాయం చేసి..బీజేపీకి వాటా పెంచాలని విష్ణుకుమార్ రాజు కోరుతున్నట్లుగా ఉంది. గతంలో బీజేపీ ఒంటరిగా స్థానిక సంస్థల్లో పోటీ చేస్తే.. పట్టుమని పది పంచాయతీలు గెల్చుకోలకేపోయారు. ఒక్క ఎంపీపీ చాన్స్ లేదు. కార్పొరేటర్లు కూడా లేరు. వ్యక్తిగత బలంతో కొన్ని చోట్ల కౌన్సిలర్లు గెలిచారు. అంత ఎందుకు స్వయంగా ఆ పార్టీ టాప్ 50 నేతలు ఒక్కరు కూడా సొంతంగా ఏ ఎన్నికలోనూ గెలవలేరు.
అయినా ఇప్పుడు కూటమిని అడ్డం పెట్టుకుని .. ఇతర పార్టీల బలంతో .. తమ పార్టీ వారికి పదవులు కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కూటమి ఫార్ములాకు తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి విష్ణుకుమార్ రాజే మాట్లాడుతున్నారు. ముందు ముందు ఇంకెవరైనా మాట్లాడితే అది ప్రత్యేక వ్యూహమే అనుకోవచ్చు.