ఆంధ్రప్రదేశ్ విద్యా , ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పనితీరుపై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ ప్రశంసించింది. ముఖ్యంగా విద్యాశాఖలో ఆయన తీసుకువస్తున్న సంస్కరణలు, సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న చొరవ అభినందనీయమని న్యాయస్థానం పేర్కొంది. కస్తూర్బా పాఠశాలల సిబ్బంది జీతాలు పెంచుతామన్న ప్రకటనను స్వాగతించింది. గతంలో పెండింగ్లో ఉన్న అనేక అంశాలను లోకేష్ బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే ఒక కొలిక్కి తీసుకురావడంపై కోర్టు సానుకూలంగా స్పందించింది.
రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో పారదర్శకత కోసం తీసుకువచ్చిన కొత్త విధానాలను హైకోర్టు ప్రస్తావించింది. కోర్టులో పెండింగ్లో ఉన్న విద్యాశాఖకు సంబంధించిన కొన్ని వివాదాలను ప్రభుత్వం సామరస్యపూర్వకంగా పరిష్కరించేలా లోకేష్ చొరవ తీసుకోవడం పట్ల న్యాయమూర్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిస్తున్న నిబద్ధతను న్యాయస్థానం కొనియాడింది.
ప్రజా సమస్యలపై మంత్రి లోకేష్ వేగంగా స్పందిస్తున్నారని.. హాస్టల్ విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటనపై వెంటనే చర్యలు తీసుకున్నారని ప్రశంసించింది. అయితే అధికారుల పనితీరుపై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.
